ముగియనున్న లెసైన్స్ గడువు
భీమవరం క్రైం : ఎక్సైజ్ కొత్త పాలసీని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. మద్యంషాపుల లెసైన్స్ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత షాపుల మంజూరుకు అనుసరించాల్సిన విధి విధివిధానాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగిసేలోగా చేయాల్సిన పనులను ఏవిధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.
జిల్లాలో ప్రస్తుతం 389 వైన్ షాపులు, 39 బార్లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా? లేక కొత్త విధానం రూపొం దిస్తారా? అనేది మద్యం వ్యాపారులకు ఉత్కంఠగా మారింది. ప్రైవేట్ వ్యక్తులు మద్యం వ్యాపారం చేసుకునేలా ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తారా? లేక ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుందా? అనేవి ప్రశ్నలుగా మారాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల నేపధ్యంలో మద్యం దుకాణాల యజమానులకు నష్టం వాటిల్లిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పాలసీని రూపొందిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని ప్రకటించకపోతే ప్రస్తుతం ఉన్న లెసైన్స్‌లనే కొన్ని నెలలు పొడిగిస్తారని పలువురు భావిస్తున్నారు.