లేటరైట్.. నో..నో | Letarait no no | Sakshi
Sakshi News home page

లేటరైట్.. నో..నో

Published Thu, Mar 26 2015 2:56 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

లేటరైట్.. నో..నో - Sakshi

లేటరైట్.. నో..నో

లేటరైట్ ఖనిజ నిక్షేపాల తవ్వకాల కోసం బుధవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య  నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తవ్వకాలను కొందరు వ్యతిరేకించగా మరికొందరు అనుకూలంగా మాట్లాడారు. తవ్వకాల వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని కొన్ని గ్రామాల గిరిజనులు  ఆందోళన వ్యక్తంచేయగా, తమ గ్రామాలకు మౌలిక వసతులు సమకూరుతాయని కొందరు సానుకూలత తెలిపారు. మొత్తం మీద మెజార్టీ గిరిజనుల అభీష్టం మేరకే నడుచుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.
 
నాతవరం: లేటరైట్ తవ్వకాలపై డీఆర్వో కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం  సుందరకోటలో ప్రజాప్రాయ సేకరణ నిర్వహించారు. మండలంలోని సరుగుడు పంచాయతీ శివారు అసనగిరి ప్రాంతంలో  సుమారు 90 ఎకరాల్లో లేటరైట్ తవ్వకాల  కోసం సింగం భవాని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తవ్వకాలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే విషయంపై అధికారులు అభిప్రాయాలు తెలుసుకున్నారు.  సరుగుడు పంచాయతీలోని 16 గ్రామాల  గిరిజనులు వచ్చారు. ముందుగా లేటరైట్‌కు సంబంధించిన పలు విషయాలను గిరిజనులకు డీఆర్వో వివరించారు.  కాలుష్య నియంత్రణ పర్యావరణ శాఖ అధికారులు ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్న  అంశాలను తెలియజేశారు. లేటరైట్ తవ్వకాల వలన కలిగే లాభ నష్టాలు, చేపట్టాల్సిన అంశాలను   సభలో చదివి వినిపించారు. ఆ తర్వాత గ్రామాల వారీగా ప్రజల అభిప్రాయాలు తెలపాలని సూచించారు. ప్రజా వేదికపైకి స్థానిక సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు సాగిన లక్ష్మణమూర్తిని పిలవకపోవడంతో ఆయన కిందే కూర్చున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ముందు సర్పంచ్‌ని ఎందుకు వేదిక పైకి ఆహ్వానించలేదని  సీపీఎం నాయకుడు వెంకన్న మరికొంత మంది లేచి డీఆర్వోని అడుగుతుండగా వెంకన్నను పోలీసులు బయటకు తీసుకెళ్లి పోయారు. వెంటనే  నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు వేదిక దిగివచ్చి సర్పంచ్‌ని పైకి తీసుకెళ్లారు.   అసనగిరి, కొత్త దద్దుగుల గ్రామ గిరిజనులు మాట్లాడుతూ,  లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వరాదని, మా ప్రాణాలు తీసి తరువాత లేటరైట్‌కు తవ్వకాలు జరపాలన్నారు.  ఈ ప్రాంతంలో ఉన్న అల్లూరి సీతారామరాజు  గృహలను కాపాడాలని కోరారు. 

  తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డు సర్పంచ్ లోతా రాముడు, బర్దనాపల్లి సర్పంచ్ పెద్దిరాజు మాట్లాడుతూ, లేటరైట్ తవ్వకాల వలన తమ గ్రామాలకు వచ్చే  కొండ గెడ్డలు కనుమరుగువుతాయని, తమకు చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.   లేటరైట్‌కు ఎట్టిపరిస్థితిలో అనుమతులు ఇవ్వరాదని డిమాండ్‌చేశారు. సుందరకోట గ్రామానికి 50 ఏళ్లుగా అధికారులు నాయకులు  రహదారి నిర్మించలేకపోయారని,  లేటైరె ట్  తవ్వకందారులు రోడ్డు వేశారని, కావునా తాము లేటరైట్‌కు  పూర్తి  మద్దతు తెలుపుతున్నామని ఆ గ్రామస్తులు స్పష్టంచేశారు.  తొరడ, కొత్త సిరిపురం, బమ్మిడికలొద్దు ముంతమామిడిలొద్దు, సరుగుడు గ్రామాలకు చెందిన గిరిజనులు కూడా లేటరైట్ తవ్వకాలకు అంగీకారం తెలిపారు.    తమ గ్రామాలకు విద్య, వైద్యం, రహదారులు, మంచినీటి  వంటి సౌకర్యాలు కల్పిస్తామని లేటరైట్ తవ్వకందారులు హామీ ఇచ్చారని, ఆ విషయాలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి పనులు చేయాలని కోరారు. లేటరైట్ లీజుదారులు గిరిజనులకు  కల్పిస్తున్న కొన్ని సదుపాయాలకు  ఆకర్షితులై గిరిజనులు ఇష్టం లేకపోయినా లేటరైట్ తవ్వకందారులకు మద్దతుగా నిలిచారని బీజేపీ నాయకుడు లోకుల గాంధీ అభిప్రాయపడ్డారు. కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్టులో చాలా తప్పులున్నాయని, వాటిని సరి చేసి ఈ ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన గ్రామాలకు  మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి గాని ప్రయివేటు వ్యక్తులు  పనులు  చేయడమేమిటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధికారులను నిలదీశారు. 

స్థానికసర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ అధికశాతం గిరిజనుల అభీష్టం మేరకే తాను నడుచుకుంటానన్నారు.  ఈ ప్రాంత  వ్యవసాయ భూముల గురించి అధికారులు  ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయుకులు లోకనాథం పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు లేటరైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక గిరిజనుల అభిప్రాయాలు పరిశీలించి మెజార్టీ సభ్యుల అభీష్టం మేరకు తదిపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు, తాహశీల్దార్ పి.కనకరావు, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, కాలుష్య,  పర్యావరణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 1991 తరువాత..
 నాతవరం: గిరిజన గ్రామాల్లో ఒకేసారి వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించడంతో గిరిజనులు  ఆందోళనకు గురయ్యారు.  ఇంత భారీ స్థాయిలో పొలీసులు  మోహరించిన సంఘటనలు ఇంతవరకు తాము ఎప్పుడూ చూడలేదని మండలంలోని సరుగుడు పంచాయతీ శివారు కొండల మీద ఉన్న గిరిజనులు చెప్పారు.

  1991లో  ఎన్నికల సమయంలో ఈ పంచాయతీలో పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఇద్దరు అధికారులు మరణించారు. అప్పట్లో మాత్రమే పోలీసులు ఈ ప్రాంతంలో సంచరించారు. సుందరకోటలో లేటరైట్ ఖనిజ నిక్షేపాల తవ్వకాల అనుమతులు కోసం బుధవారం నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణ కోసం  200 మందికి పైగా పోలీసులతో బందోబస్తు  ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో ఇంతమంది సీఐలు, ఎస్‌ఐలు, ఇతర స్పెషల్ పార్టీ పోలీసులు  గస్తీ నిర్వహించిన సందర్భాలు లేవని  గిరిజనులు తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement