
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పదవికాలం ముగిసిన అగ్నివీర్లకు (హర్యానాకు చెందిన వారు) పోలీసు, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తన్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు.
అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. నైపుణ్యం కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని చెప్పారు. కాగా హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా అగ్నిపథ్ పథకంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
అగ్నిపథ్ పథకాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ 2022 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. వీరి ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకంలో పాత విధానంలో ఉన్న దీర్ఘకాలిక పదవీకాలం, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు ఉండవు.
ఈ పథకంపై దేశంలో నిరసనలూ చెలరేగాయి. దేశం లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. కొత్త పథకంతో కోపంగా ఉన్న ఆర్మీ ఆశావహులు దీనిని వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బస్సులు, రైళ్లతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి, పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment