విశ్లేషణ
అయిదేళ్ల కాల పరిమితి తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే ప్రయత్నంలో అగ్నివీర్‌ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, వారిపై స్పష్టమైన ఒత్తిడి ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు, అగ్నిపథ్ పథకం... సైన్యంలో తీవ్రమైన కొరతకు కూడా దారి తీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్యలో సగాని కంటే కాస్త మాత్రమే ఎక్కువగా అగ్నివీర్‌లను తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకొంటారు కనుక ఈ లోటు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించలేవనే భావన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.
లోపాలను సరిదిద్దడానికి ‘ఫలితానంతర’ చర్యలపై ఆధారపడే వ్యవస్థీకృత మార్పు ఏదైనా సరే అంతర్గతంగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం అలాంటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫీసర్ ర్యాంకుకు కిందిస్థాయిలో ఉన్న సైనికుల నియామక ప్రక్రియను మార్చడానికి అంటూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిపోతున్న రిటైర్డ్ సైనికుల పెన్షన్ బిల్లును తగ్గించడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. సాయుధ దళాలలోని ఇతర ర్యాంకులు యువతతో నిండి వుండేలా ఇది దోహదపడుతుంది. అయితే ఈ పథకం సాయుధ దళాలలో చేరడానికి ఆసక్తి ఉన్న యువత నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష చేయాలంటూ రాజకీయవర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి.
అగ్నిపథ్ ఆలోచన ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే భావన నుండి తీసుకోవటం జరిగింది. ఇది సైనిక సేవ కోసం ఎంపిక చేసేవారి కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశ సైన్యాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. అప్పటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మన సాయుధ దళాలలో ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సైనికులను చిన్న సంఖ్యలలో రిక్రూట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదనను పరీక్షించడం అసలు ఉద్దేశం. అయితే, ఈ పథకం ఏకపక్షంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్‌ఎమ్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో నివేదించిన అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకాన్ని సైనిక విభాగాలకు ‘పిడుగుపాటు’గా ఆయన ఈ పుస్తకంలో అభివర్ణించారు.
ప్రస్తుతం ఈ పథకం కింద 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉండి 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ‘అగ్నివీర్’లుగా ఆరు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలానికి నియమించారు. వారిలో 25 శాతం మంది మాత్రమే పింఛను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో మరో 15 సంవత్సరాల కాలం కొనసాగేందుకు అర్హులు అవుతారు. దీనికోసం వారిని తిరిగి నమోదు చేసుకుంటారు. ఇక సైన్యం నుంచి విడుదలైన మిగతా 75 శాతం మందికి పరిహారంగా ‘సేవా నిధి’ కింద రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తారు.
ప్రస్తుతం మొత్తం రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య దాదాపు 24.62 లక్షలు. వీరిలో సాయుధ దళాల సీనియర్లు దాదాపు 19 లక్షలు కాగా, పౌర విభాగ సిబ్బంది 5.62 లక్షల మంది ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లు. ఇందులో పింఛను ఖర్చు రూ.2,07,132 కోట్లు. రక్షణ సిబ్బంది వాటా రూ. 1,19,696 కోట్లు కాగా, పౌర విభాగం వాటా రూ. 87,436 కోట్లు. ఈ రెండో మొత్తం పెన్షనరీ బడ్జెట్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంది.
కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా సాయుధ దళాలలో గౌరవప్రదమైన వృత్తిని కోరుకునే వ్యక్తులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్) అగ్ర ఎంపికగా ఉండటం వలన ఈ పథకంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఈ ధోరణిని నా సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో చూశాను. సైన్యం నుంచి విడుదలైన అగ్నివీరులలో తాము విస్మరించబడ్డామనే అపకీర్తిని మోస్తున్నట్లు, గర్వించ దగిన అనుభవజ్ఞులుగా తమను చూడరనే సాధారణ భావన కూడా వారిలో ఉన్నట్లు నేను గ్రహించాను.
ఇటీవల, అగ్నివీరులు కార్యాచరణ ప్రాంతాల్లో మోహరించినప్పుడు వారు అత్యున్నత త్యాగం చేసిన రెండు సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తి పెన్షన్ కు అర్హులైన సాధారణ సైనికులకు భిన్నంగా వారి బంధువులు ఏకమొత్తంలో మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. ఈ వివక్ష తీవ్రమైన క్రమరాహిత్యంగా నిలుస్తోంది. ఈ రోజు సైనిక విభాగాల్లో రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు అనే రెండు వర్గాలు ఉన్నాయి. అయిదేళ్ల తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే వారి ప్రయత్నంలో అగ్నివీర్‌ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పష్టమైన ఒత్తిడి కనిపిస్తోంది.
నిజానికి ఇది స్నేహబంధం, సైనికుల మధ్య పరస్పర సహకారం, యూనిట్ కల్చర్, రెజిమెంట్ పునాది వంటివాటికి హానికరమైనది. మెరుగైన ఆయుధాలతో సన్నద్ధమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మన సాయుధ దళాల అత్యాధునిక సామర్థ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్‌లలో అమెరికన్లు; గాజాలో ఇజ్రాయెలీలు; రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వైపుల సైనికులు – ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని నిష్ప్రయోజనమైనదిగా గుర్తించారు. మన విషయానికి వస్తే, నేటికీ కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రతిష్టంభన సమయంలో లద్దాఖ్‌లో చైనా సైన్యం కూడా పేలవంగా పని చేసింది.
అగ్నిపథ్ పథకం సైనిక బలగంలో తీవ్రమైన కొరతకు కూడా దారితీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్య 70,000 అయితే, కేవలం 42,000 మంది అగ్నివీర్‌లను మాత్రమే తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకోవడంతో ఈ లోటు మరింత పెరగనుంది. 39 గూర్ఖా బెటాలియన్ లలోని 60 శాతం సైనికులు ‘నేపాల్ స్థానిక గూర్ఖా’ల నుండి వచ్చినందున గూర్ఖాల నియామకం గరిష్ఠంగా దెబ్బతింది.
నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్‌ను తిరస్కరించడం వల్ల తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గూర్ఖాలను రిక్రూట్ చేయడానికి చైనీస్ సైన్యం చేసిన ప్రకటనలను తోసిపుచ్చలేము. భారతీయ యువత విదేశీ సైన్యంలో చేరడం ఆందోళన కలిగించే ధోరణి. రష్యా సైన్యంలో చేరేందుకు ఆకర్షితులవుతున్న కొంతమంది వ్యక్తుల గురించి వెలువడిన ఇటీవలి నివేదికలు దీనికి ఉదాహరణ.
అగ్నిపథ్ పథకాన్ని పునస్సమీక్షిస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. వాటిని బట్టి అగ్నివీరులను నిలబెట్టుకోవడంతో పాటుగా, సేవా సంవత్సరాల పొడిగింపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించవు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, కఠినంగా ఉండేలా మునుపటి వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యం.
ఫిట్‌నెస్ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి వయఃపరిమితిని 32 నుండి 26కి తగ్గించడంతో ఫలితం ఉండదు. సైనికుడిని సర్వతోముఖంగా తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది; వ్యక్తిగత దారుఢ్యం 20ల చివరలో, 30ల ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే వివాదాస్పద సరిహద్దులను 42 ఏళ్లు పైబడిన మధ్యస్థ వయస్సుతో కాపు కాస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఫిట్‌నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకపోవడం గమనార్హం.
సాయుధ దళాలు, రక్షణ విభాగంలోని పౌర సంస్థల సంఖ్యను సరైన పరిమాణంలోకి తీసుకురావడం ద్వారా పెన్షన్ బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) 10,000 మంది కాంట్రాక్టు కార్మికులను, సుమారు 50 పరిశోధన శాలలతో పాటు దాదాపు 30,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. డీఆర్‌డీఓని పునర్నిర్మించడం, కుదించటం కోసం విజయ్ రాఘవన్ కమిటీ ఇటీవలి సిఫార్సులు సరైన దిశలో ఒక అడుగు. దాదాపు 80,000 మంది కార్మికులు పనిచేస్తున్న 41 ఆర్డినెన్స్ కర్మాగారాలకు ఇదే విధమైన కసరత్తు అవసరం.
ఒక వ్యవస్థ స్థితిస్థాపకత... తప్పును సరి చేయగల దాని సామర్థ్యంలో ఉంటుంది. సైనిక విభాగం పెద్దలు అన్ని ఇతర పరిగణనలను పక్కన పెట్టి భారీ సంస్థాగత ప్రయోజనార్థం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాను.
జి.జి. ద్వివేది
వ్యాసకర్త రిటైర్డ్ మేజర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment