కందులు, మినుములు కొనుగోలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రొద్దుటూరు :‘‘రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం నాఫెడ్ ద్వారా కొనగా మిగిలే కందులను రాష్ట్రమే సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 45వేల టన్నుల కందుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చింది, అదనంగా 55వేల టన్నులు కొనుగోలు చేయాలని కోరినా అంగీకరించలేదు. కందుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి గత సోమవారం అమరావతిలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అయితే గురువారం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. దీంతో రైతులు మంత్రుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విమర్శిస్తున్నారు.
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ అధికారులు మినుముల కొనుగోలుకు సం బంధించి కడప మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా కందుల కొ నుగోలుకు కడప, రాయచోటి, ఎర్రగుంట్ల, శనగ కొనుగోలుకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో వ్యాపారులు మినుములు అమ్ముతున్నారని అధికారులు బుధవారం కడప మార్కెట్ యార్డులో దాడులు చేయడంతో అక్కడ కొనుగోలు తాత్కాలికంగా నిలిపేశారు.
మిగతా కొనుగోలు కేంద్రాలతో పోల్చితే చివరగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగలు, కందులు, మినుములు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ముందే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందనే విషయం తెలుసుకున్న రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకోవాలని ఆశతో వచ్చారు. కందులు, మినుములు క్వింటాలు ధర బయట మార్కెట్‌లో రూ.4వేలు మాత్రమే ఉండగా కొనుగోలు కేంద్రంలో కందులు రూ.5,450, మినుములు రూ.5,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రైతులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, లింగాల, వేంపల్లి తదితర దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొనుగోలు కేంద్రంలోని డీసీఎంఎస్ అధికారులు ససేమిరా అంగీకరించలేదు. కేవలం శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉండటంతో టోకన్లు ఇస్తున్నామని, తొలి రోజు కందుల కొనుగోలుకు టోకన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పై అధికారుల అనుమతి వచ్చేంత వరకు కందులు, మినుములను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో రైతులు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారుల హవా నడుస్తోందని, ఈ కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment