నాడు కళకళ.. నేడు వెలవెల
ఎరువుల దుకాణాలు..
- జాడేలేని వర్షాలు
- ఎరువుల కొనుగోలుకు ఆసక్తి చూపని రైతులు
- మూడేళ్ల క్రితం 5,650 హెక్టార్లలో సాగు
- ఈసారి 2,120 హెక్టార్లు
వెల్దుర్తి: పంటల సాగు కోసం రైతులు ఎరువుల కొనుగోలులో అంతగా ఆసక్తి చూపడం లేదు. గత మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలతో వాగులు, కుంటలు, చెరువులు జలకళతో పొంగి పొర్లాయి. మూడు సంవత్సరాల క్రితం మండలంలో వివిధ రకాల పంటలను 5,650 హెక్టార్లలో సాగు చేశారు. గత సంవత్సరం 3,800 హెక్టార్లు, ఈసారి 2,120 హెక్టార్లలో సాగు చేశారు. అప్పట్లో గుంట భూమిని కూడా వదలకుండా రైతులు పంటలను సాగు చేశారు.
అప్పట్లో రైతులు ఎరువుల కొనుగోలు కోసం సొసైటీ, వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీశారు. నిలబడే ఓపిక లేక రైతులు ఎరువుల కోసం చెట్ల కొమ్మలు, పాదరక్షలను గుర్తుగా లైన్‌లో పెట్టి ఎరువులు కొనుగోలు చేశారు. గత ఏడాది కురిసిన అంతంత మాత్రం వర్షానికి భూగర్భజలాలు అడుగంటాయి. నీటి వసతి లేక పంటల సాగు కాక ఎరువుల కొనుగోలుపై ఆసక్తి చూపడంలేదు. ఈసారి కూడా వర్షాల జాడ లేక పోవడంతో సాగు అంతగా లేదు. ఎరువుల కొనుగోలుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎరువుల దుకాణాల వద్ద రైతులు మచ్చుకైనా కనిపించడం లేదు.
వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు 2,148 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. 2012లో 2 వేల మెట్రిక్ టన్నులు, 2013లో 1,544 మెట్రిక్ టన్నులు, 2014లో 1,394 మెట్రిక్ టన్నులు, 2015లో 1,509 మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ఈసారి ఇప్పటి వరకు 412 మెట్రిక్ టన్నుల యూరియా, 24 మెట్రిక్ టన్నుల డీఏపీ, 263 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 128 మెట్రిక్ టన్నుల పొటాష్ ఎరువులను మాత్రమే కొనుగోలు చేశారు. నాడు రైతులు బారులు తీరి కొనుగోలు చేయడంతో ఎరువుల దుకాణాలు ళకళలాడాయి. నేడు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి అంతగా పంటలు సాగుకు నోచుకోకపోవడంతో ఎరువుల దుకాణాలు వెలవెలబోతున్నాయి.
నాడు రూ.50 వేల విలువ చేసే ఎరువులు కొనుగోలు
మూడేళ్ల క్రితం నాకున్న నాలుగెకరాలు, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశా. అప్పట్లో రూ.50 వేల విలువైన ఎరువులను కొనుగోలు చేశా. రెండేళ్ల క్రితం వర్షాలు సరిగ్గా లేక ఉన్న కాడికి సాగు చేసి రూ.25 వేల ఎరువులను తెచ్చా. గత ఏడాది రూ.15 వేల ఎరువులు తీసుకున్నా. ఈ ఖరీఫ్‌లో నీరులేక కేవలం రెండెకరాల్లో సాగు చేపట్టి రూ.5 వేల ఎరువులను మాత్రమే కొనుగోలు చేశా.
- ఎర్ర యాదగిరి, వెల్దుర్తి
పెట్టుబడి వస్తే చాలు
నాకున్న ఒకటిన్నర ఎకరంలో మూడేళ్ల క్రితం చేసిన సాగుకు రూ.10 వేల ఎరువులు కొనుగోలు చేశా. గత ఏడు అంతగా నీరు లేక ఎకరంలో సాగు కోసం రూ.4 వేల ఎరువులను కొనుగోలు చేశా. ఈసారి నీరులేక అర ఎకరంలో మాత్రమే తుకం పోశా. దీని కోసం రూ.2 వేల ఎరువులు మాత్రమే తీసుకున్నా. ఈ పెట్టుబడి వస్తే చాలు. వర్షాలు కురిస్తే బాగుండు.
- చాకలి ఆశయ్య, వెల్దుర్తి
ఎకరమే..
నాకున్న నాలుగెకరాల పొలంలో సాగు కోసం మూడేళ్ల క్రితం రూ.20 వేల విలువ గల ఎరువులను తీసుకున్నా. రెండేళ్ల క్రితం రూ.15 వేలు, గత సంవత్సరం రెండెకరాల్లో మాత్రమే సాగు చేసి రూ.10 వేల ఎరువులను కొనుగోలు చేసుకున్నా. ఈసారి నీటి జాడ అంతగా లేకపోవడంతో ఎకరం పొలంలో సాగు చేశా. ఇందు కోసం రూ.6 వేలతో ఎరువులను కొనుగోలు చేశా.
- పొన్నం పోతాగౌడ్, వెల్దుర్తి