భలే కిక్కు
- మద్యం దుకాణాల టెండర్లకు ముగిసిన గడువు
- చివరి రోజు పోటెత్తిన వైనం
- దరఖాస్తుల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం
- నేడు లాటరీ ద్వారా లెసైన్సుల మంజూరు
- 100కు పైగా షాపులకు దరఖాస్తులు నిల్
చిత్తూరు (అర్బన్): మద్యం దుకాణాల నిర్వహణ లెసైన్స్‌ల జారీకి దరఖాస్తులు వెల్లువెత్తారుు. రెండు రోజులుగా అంతంతమాత్రంగా పడిన దరఖాస్తులు చివరి రోజైన శుక్రవారం సుమారు వెయ్యికి పైగా వచ్చాయి. మహిళలు, వృద్ధులు, పిల్లల నుంచీ దరఖాస్తులు అందడం గమనార్హం. జిల్లాలోని 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులు ఈనెల 23న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో పోటీదారులు బారులుతీరారు.
రూ.2 కోట్ల ఆదాయం
చిత్తూరులో 214, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 244 మద్యం దుకాణాలకు మొత్తం రెండు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి దరఖాస్తుకూ రూ.25 వేలు (నాన్ రీఫండబుల్) డీడీ రూపంలో దరఖాస్తుదారులు చెల్లించాలి. ఈ లెక్కన ఇంకా ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే ప్రభుత్వానికి దాదాపు రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. 2014-15 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ పెట్టుకున్న రూ.117 కోట్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోనుంది.
నేడు లాటరీ ద్వారా ఎంపిక
లెసైన్సుల ఖరారు కోసం శనివారం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పేర్కొన్నారు.
పలు దుకాణాలకు దరఖాస్తులు నిల్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి లెసైన్సుల జారీ రుసుములను భారీగా పెంచేయడం, దుకాణాల ధరలూ పెరగడంతో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తులు పడలేదు. వీటి సంఖ్య జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చివరి రోజున ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమంది టెండర్లు వేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఏయే దుకాణాలకు టెండర్లు పడలేదనే విషయాలను అధికారికంగా ధ్రువీకరించలేదు.
మేము సైతం
మద్యం దుకాణాల లెసైన్సుల కోసం ఈసారి మహిళామణులు టెండర్లు వేశారు. దుకాణాల కేటాయింపులో ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కొందరు మహిళలు ఒక్కరే నేరుగా పాల్గొని లెసైన్సుల కోసం దరఖాస్తులు వేశారు. మరికొన్ని దుకాణాలను భర్తలు సెంటిమెంట్ కోసం వారి భార్యలు, కుమార్తెల వద్ద టెండర్లు వేయించారు. మరికొందరు వారి తల్లులను సైతం తీసుకువచ్చి టెండర్లు వేయించారు.
పలుచోట్ల వాగ్వివాదం
మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన దరఖాస్తుదారులు పలు చోట్ల వాగ్వివాదాలకు దిగారు. శ్రీకాళహస్తి మండలంలో ఒకే షాపునకు 23 మంది దరఖాస్తులు వేయగా, ఎక్సైజ్ అధికారుల ముందే నువ్వు వేయకూడదంటే... నువ్వు వేయకూడదని దుర్భాషలాడుకున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులను అందజేయాల్సి ఉంది. తిరుపతి - చిత్తూరు మార్గంలో రైల్వేగేటు పడిపోవడంతో 20 మంది దరఖాస్తులు వేయలేకపోయారు. సమయం సమీపిస్తుండడంతో దరఖాస్తులు వేయడానికి పలువురు పరుగులు తీసి టెండర్లను దాఖలు చేశారు.