బోన్‌మారో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి నవ్య
సాక్షి, మందస: ఆ దంపతులిద్దరూ రోజూ కూలీకి వెళ్తే తప్ప కుటుంబ పోషణ గడవదు. పేదరికానికి చెందిన వీరు ఇద్దరు పిల్లలను ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నారు. కానీ, విధి బలీయమైనది. ఎప్పుడు.. ఎవరినీ.. ఎలా బాధిస్తుందో తెలియదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఆ కుటుంబానికి ఏర్పడింది. ఆ పేద కుటుంబానికి కేన్సర్ రూపంలో కష్టాన్ని తీసుకువచ్చింది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన లొహరిబంద గ్రామానికి చెందిన రెయ్యి రాజు, లక్ష్మీకాంతానికి కుమార్తె నవ్య(ప్రేమకుమారి) నాలుగు తరగతి చదువుతోంది. కుమారుడు నవదీప్ 7వ తరగతి చవుతున్నాడు. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే నవ్య చదువులో కూడా ఎంతో తెలివితేటలు చూపింది. కానీ తెలియని బాధ అనుభవిస్తున్న చిన్నారి నవ్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యులు కేన్సర్ అని నిర్థారించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తనకు కలిగిన బాధను భరిస్తూ ఇప్పటికీ నవ్య నవ్వుతూనే ఉంది.
బిడ్డను ఎలాగైన బతికించుకోవాలన్న తపనతో అప్పులు చేసి మరీ సుమారు రూ.7 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. నవ్య మెడపై కణితి రోజురోజుకూ పెరిగిపోతుండడంతో తమిళనాడు కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బోన్‌మారో కేన్సరని చికిత్సకు సుమారు రూ.30 లక్షల వ్యయం అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు నోటిమాట రాలేదు. ఈ గండం నుంచి బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక మనోవేదన అనుభవిస్తున్నారు. కూలికి వెళ్తే కానీ బతుకుబండి ముందుకు సాగని తల్లిదండ్రులు ఆవేదనకు గురతున్నారు. ఎలాగైనా బిడ్డను బతికించుకోవాలని దాతల సాయం కోరుతున్నారు. ఫోన్ 7993024330 నంబరును సంప్రదించాలని, 33914104113 ఎస్‌బీఐ ఖాతా నంబరుకు, 8790940529 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా సాయం చేయాలని నవ్య తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment