రుణా మాఫీపై విధానాలకు కమిటీ | Loan waiver to the Committee | Sakshi
Sakshi News home page

రుణా మాఫీపై విధానాలకు కమిటీ

Published Sun, Jun 8 2014 1:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రుణా మాఫీపై విధానాలకు కమిటీ - Sakshi

రుణా మాఫీపై విధానాలకు కమిటీ

ఆ కమిటీ అధ్యయనం మేరకే మాఫీ అమలు: లోకేష్
 
చంద్రబాబు ప్రమాణం చేశాక కమిటీ ఏర్పాటుపై సంతకం
నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య లేదా మరొకరు కమిటీకి సారథ్యం
రుణ మాఫీ విధివిధానాలపై పక్షం రోజుల్లో మధ్యంతర నివేదిక
ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు.. 45 రోజుల్లో తుది నివేదిక
పంట రుణాలే రూ. 59,105 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు
డ్వాక్రా రుణాలు కలిపితే మొత్తం రుణాలు రూ. 87,612 కోట్లు

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాల మాఫీకి విధి విధానాలను ఖరారు చేసేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. ఆయన కుమారుడు నారా లోకేష్ శనివారం గుంటూరు జిల్లాలో ఈ విషయం వెల్లడించారు. కమిటీ విధివిధానాలను రూపొందించి సమగ్ర అధ్యయనం చేస్తుందని, దానికి అనుగుణంగానే పథకాన్ని అమలు చేస్తామని లోకేష్ చెప్పారు. ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం వేదిక మీద నుంచి.. ఈ నిపుణుల కమిటీ ఏర్పాటు ఫైలుపైన చంద్రబాబు సంతకం చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వ్యవసాయ రుణాలన్నింటినీ, అలాగే డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ రుణాల మాఫీ ఏ విధంగా చేయాలనే విషయంపై ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి ప్రభుత్వ యంత్రాంగం రాలేకపోయింది. ఈ నేపథ్యంలో రుణాల మాఫీకి విధివిధానాలను ఖరారు చేసేందుకు నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య లేదా మరొకరి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నారని అధికార వర్గాల సమాచారం. ఈ కమిటీకి ఆర్థిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సహాయ సహకారాలను అందించనున్నారు. ఆర్‌బీఐతో, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని కమిటీకి నిర్దేశించనున్నారు. ఈ కమిటీ రుణ మాఫీ విధివిధానాలను ఖరారు చేస్తూ పక్షం రోజుల్లో మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రుణ మాఫీ ఏ రంగం రుణాలకు, ఎవరికి వర్తిస్తుందనే వివరాలు విధి విధానాల్లో ఉంటాయనేది అధికారుల సమాచారం. పక్షం రోజుల్లో విధివిధానాలు ఖరారైతే బ్యాంకర్లు ఖరీఫ్‌లో రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయడానికి వీలుగా ఉంటుందనేది అధికారుల వాదనగా ఉంది. ఆ తరువాత మాఫీ అయ్యే రుణాలను ప్రభుత్వం ఏ విధంగా తిరిగి తీర్చాలనే దానిపై కమిటీ తుది నివేదిక సమర్పించడానికి 45 రోజుల గడువు విధించనున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయ రుణాలపై సీఎస్‌కు అధికారుల నివేదిక...

 ఇదిలావుంటే.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అన్ని రకాల వ్యవసాయ రుణాలపై లెక్కలతో కూడిన నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక రూపంలో సమర్పించారు. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలగా అన్ని రకాల బ్యాంకులు కలిపి 13 జిల్లాల్లోని రైతులకు రూ. 37,058.08 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో రూ. 22,992.44 కోట్లు ఖరీఫ్ సీజన్‌లోను, మిగతా రూ. 14,065.64 కోట్లు రబీ సీజన్‌లోను మంజూరు చేశాయి.
  మొత్తం పెండింగ్ వ్యవసాయ రుణాలు (పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలు, ఉత్పత్తుల రుణాలు, చేపల చెరువుల వర్కింగ్ కేపిటల్ రుణాలు కలిపి) 2014 మార్చి 31 నాటికి రూ. 59,105.66 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం రుణాలు 84,86,890 రైతుల అకౌంట్లపై ఉన్నాయి.మొత్తం 84,86,890 రైతుల అకౌంట్లలో 72,13,857 అకౌంట్ల రైతులు చిన్న, సన్నకారు రైతులే. మిగతా రైతులు సంఖ్య 12,73,033 గా ఉంది.

సీఎస్‌కు సమర్పించిన నివేదకలో 31-03-2014 నాటికి మొత్తం పంట రుణాలు రూ. 59,105.66 కోట్లుగా తేల్చారు.ఇందులో బంగారంపై రుణాలు రూ. 20,137.99 కోట్లను మాఫీ నుంచి మినహాయించాలని, అలాగే వ్యవసాయ ఉత్పత్తులపై తీసుకున్న రూ. 2,500 కోట్లు, చేపల చెరువులకై వర్కింగ్ కేపిటల్‌గా తీసుకున్న రూ. 2,400 కోట్ల రుణాలను మాఫీ నుంచి మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ మినహాయింపుల అనంతరం మాఫీ చేయాల్సిన పంట రుణాలు రూ. 34,067.67 కోట్లుగా అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇందులో ఏ విధానం అమలు చేయాలనేది ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లక్ష రూపాయల వరకు గత రుణాలను మాఫీ చేయాలా? లేదా లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలా? అనే విషయంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. బంగారంపై తీసుకున్న రుణాల్లో కూడా ఎంత వరకు షరతులు లేకుండా అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
 
కోటి మంది రైతుల ఆశలు నెరవేరేనా?

 ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన చేయబోయే తొలి సంతకం కోసం కోటి మంది రైతులు, లక్షలాది మంది డ్వాక్రా మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుల, మహిళా సంఘాల రుణాల మాఫీపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ప్రకటించడంతో.. మరికొద్ది గంటల్లో ఆ హామీ నెరవేరుతుందని వారంతా వేచిచూస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినపుడు రుణ మాఫీలపై చంద్రబాబు ఎటువంటి ఆంక్షలను విధించలేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అయితే లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తానని స్పష్టంగా ఎన్నికల ముందే ప్రకటించారు. అయితే చంద్రబాబు అలాంటి షరతులు ఏమీ విధించలేదు. వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో కోటి మంది రైతులు తమ రుణాలన్నీ మాఫీ అవుతాయనే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. పంట రుణాలతో పాటు, వ్యవసాయ టర్మ్ రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని రైతన్నలు ఆశిస్తున్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆంక్షలను, షరతులను విధించలేదు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. బ్యాంకర్లు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు స్వయం సహాయక సంఘాల రుణాలతో కలిపి మొత్తం వ్యవసాయ రుణాలు 31-03-2014 నాటికి ఈ విధంగా ఉన్నాయి.
 
 కేటగిరీ                                                          రుణం (రూ. కోట్లలో)
పంట రుణం                                                          34,105
వ్యవసాయ బంగారు రుణాలు                                     20,102
టర్మ్ రుణాలు                                                       1,419
టర్మ్ రుణాలుగా మారిన పంట రుణాలు                          7,000
డ్వాక్రా మహిళల రుణాలు                                         14,204
పరోక్ష రుణాలు                                                      10,782
మొత్తం                                                               87,612
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement