సాక్షి ప్రతినిధి, కడప: ప్రాంతానికొక నిర్ణయం, జిల్లాకో ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తోందని, తద్వారా ప్రజలు తీవ్ర అసౌకర్యాలు గురవుతున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించారన్నారు.
అంతకంటే దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో వెసులుబాటు కల్పించాలని కోరారు. వృద్ధులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా జిల్లాలో తాగునీటి పరిస్థితులు దుర్భరంగా మారాయని వివరించారు. రాయచోటిలో ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో తాగునీటి సమస్యను అధిగమించామని తెలిపారు. అయితే కరువు నేపధ్యంలో ట్రాన్సుఫోర్టు ద్వారా నీటిని తరలిస్తున్నారని వివరించారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
అయితే ట్యాంకరుకు రూ.350 మాత్రమే కేటాయిస్తున్నారని తెలిపారు. దాంతో నీటి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వివరించారు. ట్రాక్టర్ ట్యాంకర్‌కు రూ.500 లకు పెంచితే అవసరమైన గ్రామాలకు తాగునీరు కొరత లేకుండా అందించవచ్చునని, ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంట రుణాలతో పాటు బంగారు ఆభరణాలపై రుణాలు పొందిన రైతులకు కూడ రుణమాఫీ వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వానికి వివరించారు. తాళిబొట్టు సరుడులు సైతం బ్యాంకుల్లో రైతులు పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పసుపు రైతుల్ని ఆదుకోండి....
ఎమ్మెల్యే జయరాములు
రాయలసీమలో పసుపు పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారని, ఏడాది పసువు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఇన్‌పుట్ సబ్సిడీ వర్తింపజేయాలని బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో పసుపు పండించే రైతులకు ఈ ఏడాది ప్రకృతి సహకరించలేదని, పెపైచ్చు పెస్టిసైడ్స్ కంపెనీల నిర్వాకం కారణంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పసుపు పంట రుణాలకు సైతం రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధిక పెట్టుబడితో కూడిన పసుపు రైతులు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారని, తక్షణమే ఎకరాకు రూ.20వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలే ఎజెండాగా ధ్వజం...
అసెంబ్లీలో ప్రజాసమస్యలే ఎజెండాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ వ్యవహరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అధికార పక్షం వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయం కారణంగా రైల్వేకోడూరులో 200 చిన్నతరహా పరిశ్రమలు మూత పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే శ్రీనివాసులు శాసనసభలో వివరించారు.
తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి మృగ్యమైందని తెలిపారు. ప్రభుత్వం భూనిర్వాసితులు, చిన్నతరహా పరిశ్రమల యజమానుల కడుపు కొట్టిందని వివరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ ఉద్యోగుల తొలగింపు నేపధ్యంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖర్ని తప్పుబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందనుకుంటే ఉన్నది ఊడుతోందని వివరించారు.
అసెంబ్లీలో బయట ప్రభుత్వ వైఖరి ఏకపక్షంగా ఉంటుందని ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సహించరాని చర్యగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చేయని తప్పుకు ఏకపక్షంగా తనను గతంలో సస్పెన్షన్ చేశారని, అయితే తెలుగుదేశం సభ్యులు అడ్డదుడ్డంగా వ్యవహరిస్తున్నా, తోటి సభ్యుల పట్ల అవమానంగా మాట్లాడుతోన్న సాక్షాత్తు స్పీకర్ సైతం నియంత్రించకపోవడం దారణమని వివరించారు. జిల్లా ఎమ్మెల్యేలు పలు అంశాలపై మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పీకర్ అందరికీ అవకాశం కల్పించకపోవడం విశేషం.
ప్రాంతానికో నిర్ణయమా!
Published Wed, Dec 24 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement