సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘‘మనబడి నాడు - నేడు’’ కార్యక్రమం ద్వారా మూడు విడతల్లో.. ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 126 పాఠశాలలకు 30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల మరమ్మతులకోసం ఒక్కోక్క జిల్లాకు 60 కోట్లు, ‘‘మనబడి నాడు-నేడు’’ కింద 2 నుంచి 3 వందల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కో జిల్లాకు సంవత్సరానికి 6 నుంచి 7వందల కోట్లను ప్రభుత్వ పాఠశాలల ఆభివృద్దికి ఉపయోగించనున్నామని తెలిపారు.
అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక్కోక్క నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల మంది తల్లుల ఖాతాలోకి రూ.15,000 చొప్పున నగదు జమ చేశామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని తెలిపారు. నాణ్యత కలిగిన భోజనం అందించేందుకు సీఎం జగన్ గోరుముద్దను ఆవిష్కరించారన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు పాటిస్తూ మనబడి నాడు-నేడు కార్యక్రమం పూర్తి చేయాలని, లేకుంటే నాబార్డు నిధులు వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నారు. జగనన్న కానుక పేరుతో విద్యార్థులకు స్కూల్ డ్రస్, బ్యాగులు అందజేయనున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment