హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తామని చెప్పడం ద్వారా అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సమావేశాలను హాయ్ల్యాండ్లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కోరిన ఆయన ప్రైవేటు స్థలాల్లో అసెంబ్లీ నిర్వహిస్తే భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్, సచివాలయాన్ని ఆధునీకరించి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.