రూ. 32 వేల కోట్ల జీతాలు దండగ అంటారా?
హైదరాబాద్: అగ్రిగోల్డ్ అంశం 32 లక్షల మందికి సంబంధించిన అశం అని, దీనిపై అసెంబ్లీలో తక్షణమే చర్చ జరపాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు ఎక్కడ సీబీఐ విచారణ జరుపుతుందో అని భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీఐడీ విచారణకు ఆదేశించిందని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు సంబంధించిన ఆస్తులను ఎటాచ్మెంట్ నుంచి తప్పించి లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల పొట్టగొట్టారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.
టీడీపీ ప్రభుత్వం గతంలోని మాదిరిగానే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గత 9 ఏళ్ల పాలనలో ఉద్యోగులను చాలా రకాలుగా అవమానించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారన్నారు. మంత్రులు మాట్లాడుతూ.. 32 వేల కోట్ల జీతాలు దండగ అని వ్యాఖ్యానించడంలో ఉద్దేశం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పోలీసు అధికారులపై వత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులను బనాయిస్తూ చివరకు పోలీసు వ్యవస్థను కూడా టీడీపీ బ్రష్టు పట్టిస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 42 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జిల్లా, మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాల హామీని నిలబెట్టుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కార్పోరేషన్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును వెంటనే పెంచాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.