బాలకృష్ణ ఇలాకాలో ఉద్రిక్తత
హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హిందూపురంలో కూరగాయల మార్కెట్‌ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ధర్నాకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఇంటివద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్నాలో పాల్గొనేందుకు నవీన్‌ను ఇంటినుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నవీన్ ఇంటి వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నాలో పాల్గొనకుండా నవీన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు.
బాలకృష్ణ హామీలను విస్మరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా, పోలీసులు ముందస్తుగానే అడ్డుకుంటున్నారు. ఈ నెల 7 నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాలకృష్ణ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేగాక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.