మినరల్ వాటర్‌కోసం సామాజిక దూరం పాటిస్తున్న నగరవాసులు, నిర్మానుష్యంగా ఉన్న రహదారిలో పోలీస్ పహారా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎక్కడో చైనాలో వచ్చిందిలే మనవరకూ రాదనుకుంటున్నాం. పక్కదేశాలకు పాకిందంటే మనకు పర్లేదులే అనుకున్నాం. మన దేశంలోకే, పొరుగు రాష్ట్రానికి కూడా వచ్చేసిందనగానే... మన దగ్గరకు రాలేదనుకున్నాం. కానీ చూస్తుండగానే అతి తక్కువ సమయంలోనే మన జిల్లా పక్కకే వచ్చేసింది కరోనా మహమ్మారి. పక్కనే ఉన్న విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో కొత్తగా కేసు వెలుగు చూసింది. మనం అత్యంత జాగ్రత్తగా లేకపోతే కరోనా వైరస్ మన వరకూ రావడానికి ఎంతో సమయం పట్టదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పలు చర్యలు చేపడుతున్నారు. (కరోనా యాప్ రాబోతుంది)
యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలో కోవిడ్–19 నివారణలో భాగంగా అమ లు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె, ఉపిరి తిత్తుల వ్యాధులు వంటి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారి సమాచారం సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
(భయం గుప్పిట్లో వెంకటాపురం)
ఈ వ్యాధులతో బాధపడుతున్న వారి ఇంటికే అవసరమైన మందులను జిల్లా డ్రగ్ స్టోర్ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సంపూర్ణ పోషకాహార పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలను గుర్తించి వారికి అవసరమైన పోషకాహారాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తల ద్వారా వారి ఇంటికే రేషన్ సరుకులు అందజేస్తున్నారు. ఈ నెల 29 నుంచి రేషన్ సరుకులను తెల్ల రేషన్ కార్డుదారులకు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వలంటీర్ల ద్వారా ఇంటికే అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
కూరగాయలకు కొరత లేకుండా...
పట్టణాలు, గ్రామాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయల లభ్యతను పరిశీలించి రానున్న రోజుల్లో వాటి సరఫరాలో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎక్కడా నిత్యావసర సరుకులు, కూరగాయలకు కొరత లేకుండా ప్రయత్నిస్తున్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ శాఖల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే పంప్ మెకానిక్‌లు, బోర్ మెకానిక్‌లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు, లైన్‌మన్లకు అవసరమైన గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కరోనా నివారణ చర్యల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి సంబంధిత రెవిన్యూ డివిజన్ అధికారులు, జిల్లా రెవిన్యూ అధికారి ద్వారా అవసరమైన మేరకు పాస్‌లు జారీ చేయనున్నారు.
రోగగ్రస్తుల సమాచార సేకరణ పూర్తి
జ్వరాలు, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి జరుపుతున్న సమాచార సేకరణ శుక్రవారం సాయంత్రానికి దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు, వారు ఎన్ని రోజుల క్రితం చేరుకున్నదీ, ఎప్పటి నుంచి ఇంటి వద్ద క్వారంటైన్‌లో ఉన్నదీ తదితర వివరాలను గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు సేకరించి అధికారులకు అందజేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లాకు వచ్చే వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటి వరకు 437 మంది విదేశాల నుంచి జిల్లాకు చేరినట్టు గుర్తించారు. వారంతా ఎన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారో సంబంధిత సమాచారం సేకరిస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అవసరమైన పరికరాలు సదుపాయాలూ ఉన్నదీ లేనిదీ పరిశీలించి చెక్ లిస్టు మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాజిక దూరం పాటిస్తున్న జనం
నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు రోడ్లపైకి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. రెండు రోజులతో పోల్చుకుంటే ఈ విషయంలో శుక్రవారం ప్రజల్లో చైతన్యం పెరిగింది. విచ్చలవిడిగా సంచరించకుండా అన్ని చోట్ల మీటరు నుంచి రెండుమీటర్ల దూరం పాటిస్తున్నారు. చివరికి మెడికల్ దుకాణాల వద్ద సైతం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించటం గమనార్హం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
జిల్లాలోని అన్ని పంచాయతీలు, పట్టణాల్లో కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. వీధుల్లోని కాలువల్లో వ్యాధినిరోధక మందులను స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల పల్లెవాసులు, పట్టణవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment