
కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో తిరుపతిలో సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు.
సాక్షి, తిరుపతి: కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో తిరుపతిలో రేపటినుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సోమవారం ప్రకటించారు. అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా దుకాణాలకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమయం దాటాకా వాహనాలకు కూడా అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ ఆంక్షలు వచ్చే నెల 5 వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత అధికమవుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు చిత్తూరులో 5400 కరోనా కేసులు నమోదుకాగా, వీటిలో అత్యధికంగా తిరుపతిలోనే 1700 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించి సహకరించాలని ఎస్పీ రమేష్ రెడ్డి కోరారు. పోలీసు శాఖలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికే ఇద్దరు పోలీసులు కరోనా కారణంగా మరణించారని పేర్కొన్నారు.