నాయుడుపేటటౌన్: పట్టణంలో పరిస్థితులను సమీక్షిస్తున్న పోలీసులు, వైద్యాధికారులు
జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పూటపూటకు పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే శుక్రవారం నాటికి జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మొత్తాన్ని అష్టదిగ్బంధం చేసి లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీకి వెళ్లొచ్చిన వారివే కావడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పరుగులు తీస్తోంది. శుక్రవారం మరో ఎనిమిది పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో 32కు చేరింది. దీంతో జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగిస్తూ లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువ నెల్లూరు నగరం, నాయుడుపేటలో ఉండటంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి రోజుకు నాలుగు పూటలా పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను సైతం అష్టదిగ్బంధం చేసి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇతర సాధారణ వ్యాధులు ఉన్న రోగులకు ఇబ్బంది లేకుండా డిస్ట్రిక్ట్ టెలీమెడిసిన్ కన్సల్టెన్సీ ద్వారా తాత్కాలిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. నారాయణ హాస్పిటల్‌ను పూర్తిగా కరోనా క్వారంటైన్‌గా మార్చేసిన క్రమంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాస్పిటల్‌ను పరిశీలించారు.
రెండు రోజుల్లోనే..
జిల్లాలో బుధవారం వరకు మూడు కేసులు నమోదు కాగా, గురు, శుక్రవారాల్లోనే పాజిటివ్ కేసులు 32కు పెరిగాయి. దీంతో జిల్లాంతటా ఢిల్లీ టెర్రర్ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌కు తరలించిన 219 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపగా వాటిలో 32 కేసులు పాజిటివ్‌గా రా>గా, 116 కేసులు నెగెటివ్‌గా వచ్చాయి. మరో 71 కేసులకు సంబంధించి రిపోర్ట్‌లు రావాల్సింది. రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదైన జిల్లా కావడంతో అధికార యంత్రాంగం శనివారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సరైన కారణం లేకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, కావలి, సూళ్లూరుపేటల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కోసం ప్రజలను బయటకు అనుమతించనున్నారు. జిల్లాలో అన్ని ప్రధాన రహదారులు మూసివేసి రాకపోకలను పూర్తిగా నియత్రించనున్నారు.
కరోనా కోరల్లో పేట
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలో రోజురోజుకు కరోనా పాటిజివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 4 పాజిటివ్ కేసుల నిర్ధారణ జరిగింది. దీంతో నాయుడుపేట పట్టణాన్ని అధికారులు శుక్రవారం రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన 21 మందిలో ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్ రాగా, శుక్రవారం నాటికి మరో నలుగురికి పాజిటివ్ రావడంతో ఈ సంఖ్య ఆరుకు చేరింది. దీంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆర్డీఓ సరోజినీ, సీఐ జి వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై డి వెంకటేశ్వరరావుతో పాటు వైద్యాధికారిణి దేదీప్యరెడ్డితో చర్చించి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వివరిస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమాదేవి, వైద్యాధికారిణి దేదీప్యరెడ్డి శుక్రవారం పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇళ్ల వద్దకు చేరుకుని పూర్తి వివరాలను సేకరించారు. మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి సమీప ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించి, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చుట్టు పక్కల ప్రాంతాల్లో పిచికారీ చేయిస్తున్నారు.
ఐసొలేషన్‌కు తరలింపు
పాజిటివ్ నిర్ధారణ జరిగిన వారి కుటుంబ సభ్యులు 16 మందిని శుక్రవారం జిల్లా ఐసొలేషన్ వార్డుకు తరలించారు. మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. పట్టణంలో తొలి కేసు నమోదైన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. ఆమె ఇప్పటికే ఐసొలేషన్ వార్డులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment