తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. లారీని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కంప చెట్లు అడ్డు తగలడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన శనివారం ఒంటిమిట్టలో చోటు చేసుకుంది. తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఓవర్‌టెక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఎదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టబోతుండటంతో డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించడంతో, అక్కడే ఉన్న ఇరవై అడుగుల వాగులోకి బస్సు బోల్తా పడింది. బస్సులో 32మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కడపకు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి(21) అనే విద్యార్థి బస్సు అడుగు భాగాన ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద విద్యార్థిని బయటికి తీసి రిమ్స్‌కు తరలించారు. విద్యార్థికి రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం తిరుపతికి తరలించారు. విజయవాడకు చెందిన నరేష్(45), కడపకు చెందిన అనురాధ(38), నందలూరు మండలంలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న శారద(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మిగిలిన ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. వీరందరూ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. బస్సు వాగులో పడ్డ సమయంలో కంపచెట్లు అడ్డు పడటంతో పెనుప్రమాదం తప్పింది. సంఘటన స్థలాన్ని రాజంపేట ఆర్డీఓ ఎం.విజయసునీత పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానంపై ఆరా తీశారు. బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
లారీని తప్పించబోయి..
Published Sun, Mar 30 2014 4:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement