సమైక్య సెగతో నిలిచిన లారీలు
Published Sun, Aug 11 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
చీరాల రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తథ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే చీరాలలోని లారీల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కారంచేడు రోడ్డులోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద లారీలను పది రోజుల నుంచి స్తంభింపజేశారు. దీంతో లారీల యజమానులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు తిరగకపోవడంతో వాటి యజమానులు డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు చెల్లించలేక, ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టలేకపోతున్నారు. చీరాలలో 400 పైగా లారీలున్నాయి. దాదాపు 1500 మంది కార్మికులు వీటిపై ఆధారపడి ఉన్నారు.
తగ్గిపోనున్న రాష్ట్ర పరిధి...
రాష్ర్ట విభజన తథ్యమైతే రాష్ట్రం సరిహద్దులు తగ్గిపోతాయి. గతంలో రాష్ట్ర సరిహద్దులు దాటాలంటే ఒక్కో లారీ చీరాల నుంచి 700 నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ విభజిస్తే 100 కిలోమీటర్ల లోపులోనే రాష్ట్రం సరిహ ద్దులుగా నిర్ణయిస్తారు. దీంతో లారీ యజమానులపై పన్నులు, ఇన్సూరెన్స్ కిస్తీలు మూడు రెట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం చీరాల నుంచి లారీలు రాష్ట్ర సరిహ ద్దులు దాటితే ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 5,700 ప్రభుత్వానికి పన్నులు చెల్లిం చాల్సి ఉంటుంది. కానీ విభజన జరిగితే మాత్రం 100 కిలోమీటర్లు దాటితే ఆ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాక గతంలో ఇన్సూరెన్స్‌ల రూపంలో ఏడాదికి ప్రభుత్వానికి రూ. 7 వేలు చెల్లిస్తుండగా ప్రస్తుతం ఇన్సూరెన్స్ రుసుం రూ.17 వేలపైగా చెల్లిస్తున్నారు. దీంతో లారీల యజమానులు ఎప్పుడేం జరుగుతుందేమోన ని వణికిపోతున్నారు. కొందరు కిస్తీలు కట్టలేక, నిర్వహణ భారమై లారీలను అమ్మేస్తున్నారు.
లారీలను తిప్పడం కష్టమే
ఎన్. శ్రీనివాసరావు, లారీ యజమాని
రాష్ర్ట విభజన జరిగితే లారీలను తిప్పడం కష్టమవుతుంది. గతంలో 800 కిలోమీటర్లు దాటి తే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. విభజన జరిగితే మాత్రం 100 కిలోమీటర్లు పరిధిలోనే అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరలతో అల్లాడిపోతుంటే విభజనచిచ్చు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని విరమించుకోవాలి.
ఉపాధి కోల్పోయాం
సయ్యద్ నాగూర్, లారీ డ్రైవర్.
లారీలు పదిరోజులుగా తిరగకపోవడంతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇదే విధంగా మరో పదిరోజులు లారీలు తిరగక పోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. 12వ తేదీ నుంచి సమైక్య ఉద్యమాన్ని లారీల యజమానులు తీవ్రతరం చేయనున్నారు.
Advertisement