
సాక్షి, బెంగళూరు: రకరకాల బాధలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు, లారీల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలను భారీగా పెంచిందని ఆరోపిస్తూ సోమవారం నుంచి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా లారీలు, ట్రక్కుల యజమానులు సమ్మెకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోనున్న తొమ్మిది లక్షల లారీలు, ట్రక్కులతో పాటు దేశవ్యాప్తంగా సుమారు కోటి లారీలు, ట్రక్కులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్‌లు తగ్గించాలంటూ అనేకసార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నట్లు లారీ, ట్రక్కు ఓనర్స్ అసోసియేన్స్ ప్రతినిధులు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి వరకు రూ.27 వేలుగా ఉన్న థర్డ్‌పార్టీ ప్రీమియమ్‌ను ధరను ఒకేసారి రూ.48 వేలకు పెంచడంతో లారీల యజమానులపై తీవ్రభారం పడుతోందన్నారు. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అఖిల భారత లారీ సరుకు సేవా వాహనాల యజమానుల సంఘం,రాష్ట్ర లారీ యజమానుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్ ధరలు తగ్గించే వరకు లారీల సమ్మె కొనసాగుతుందని చెప్పారు.
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
లారీల స్ట్రైక్‌తో పాలు, బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్,డీజిల్ రవాణా నిలిచిపోయే ప్రమాదముంది. ఆదివారం నుంచే అనేక నగరాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె సాకు చూపి అధిక ధరలతో దోచుకోవడానికే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించారంటూ ప్రజలు పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి లారీ సమ్మె కారణంగా పెట్రోల్ కోసం ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు.
Comments
Please login to add a commentAdd a comment