కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ? | Loss expectations on hudhud cyclone | Sakshi
Sakshi News home page

కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?

Published Sat, Nov 8 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?

కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?

కింది చిత్రంలో కనిపిస్తున్న వారు  కలెక్టరాఫీసు వరండా వద్ద ఏదో దరఖాస్తు రాస్తున్నారనుకుంటే   పొరపడినట్టే! శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో  వీరు రాస్తున్నది హుద్‌హుద్ తుపాను నష్టాల అంచనాల జాబితా. వీరిద్దరూ రామభద్రపురం వ్యవసాయ శాఖకు చెందిన ఏఈఓలు.  తుపాను తీరం దాటి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇంకా నష్టం అంచనాల ప్రతిపాదనలు పూర్తి చేయలేదు.    త్వరగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీరిలా ఆదరాబాదరాగా కలెక్టర్ కార్యాలయం వరండా వద్ద నష్టం అంచనాలను   రాసుకుంటున్నారు.
 
విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ నష్టం అంచనాలను పదిహేను రోజుల క్రితమే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు  నివేదిస్తామని  కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఇంకా వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల 4న పూర్తి నివేదిక అందజేస్తామని   వ్యవసాయ శాఖ చెప్పింది. కానీ శుక్రవారం నాటికి కూడా లెక్కలు కడుతూనే ఉన్నారు.   ఒక్క వ్యవసాయ శాఖే కాదు పంచాయతీ రాజ్, ఉద్యాన వనాలు ... చాలా శాఖల పరిస్థితి ఇలాగే ఉంది.  అంటే నష్టం అంచనాల తయారీలో ప్రభుత్వ శాఖలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.   

ప్రతీ రోజూ... ఈ రోజు ఇస్తాం! రేపు ఇస్తాం అంటూ తుపాను నష్టాల నివేదికలు పంపడంలో ఆలస్యం చేస్తుండడంతో అవి ఎప్పుడు వెళతాయి? ఎప్పుడు కేంద్ర బృందం వస్తుంది? ఇంకెప్పుడు పరిహారం అందుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వీరు నివేదికలు ఇవ్వకముందే కేంద్ర బృందం వచ్చేలా ఉందని పలువురు  ఆక్షేపిస్తున్నారు.  దీనిపై  కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ  రామారావు కూడా జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నష్టం అంచనాలు పంపించడానికి మీకెన్ని రోజులు కావాలి? త్వరగా తేల్చండి!,  ఇలా అయితే  మన నివేదిక వెళ్లకుండానే  కేంద్ర బృందంజిల్లాకు వచ్చేలా ఉందని  అధికారులపై  ఒత్తిడి తెస్తున్నారు. మరో తుపాను తరుముకొస్తున్నా  హుదుహుదు నివేదికలు పూర్తి కాకపోవడంతో వారు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సవరణల మీద సవరణలు
చాలా శాఖల్లో  జరిగిన నష్టం ఇంతేనంటూ ముందు చెప్పి మళ్లీ కొన్ని రోజుల తరువాత ఆయ్యా.... చిన్న సబ్‌మిషన్! అంటూ మరికొన్ని నష్టాలను చూపెడుతున్నారు. దీంతో నష్టాల నివేదికలో సవరణలు చోటుచేసుకుంటున్నాయి.   జిల్లాలో రూ.1197 కోట్లు నష్టం జరిగినట్టు గురువారం నాటికి అంచనా వేశారు.  అయితే అంచనాలు  పెరుగుతుండడంతో పూర్తి స్థాయి  నివేదిక ఇంకా సిద్ధంకాలేదు. జిల్లాలో ఉన్న చిన్న చిన్న శాఖలన్నీ తమ నివేదికలను అందించేశాయి. కానీ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి ఇంకా నివేదికలు రాలేదు. ప్రతీ రోజూ ఈ శాఖల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నష్టం వివరాలు అందుతునే ఉన్నాయి.   

గురువారం నాటికి నష్టం వివరాలను పంపించేయాలని, దీనికి అనుగుణంగా పని చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం త్వరపడడం లేదు.  జిల్లాలో వ్యక్తిగత ఆస్తులతో కలిసి రూ. 1197 కోట్లు నష్టం వచ్చినట్టు గురువారం సాయంత్రానికి అంచనా  వేశారు. అయితే ఇందులో  వ్యక్తిగత నష్టాలను తొలగించి శాఖాపరంగా వచ్చిన నష్టం రూ. 1097 కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇలా కూడికలు. తీసివేతలతో కాలహరణ చేస్తున్నారు తప్పా, పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించడం లేదు. నష్టం అంచానులు ఇంకా పెరిగే అవకాశముంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు తుపాను నష్టం అంచనాలు వేస్తారో అధికారులకే తెలియాలి!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement