కమలం వైపు చిన్నమ్మ
- కాంగ్రెస్ క్యాడర్‌లో నిరుత్సాహం
- పురందేశ్వరి తీరుపై ఆగ్రహం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి దంపతులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలసి ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించనున్నారు. ఆమె బీజేపీలో చేరనుండడంపై ప లువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ని రసన తెలియజేశారు. గురువారం రుషికొండలోని తన నివాసంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో దగ్గుబాటి దంపతులు సమావేశం ఏర్పాటు చేశారు.
పార్టీని వీడుతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. బీజేపీలోకి వెళతానని ఆమె స్పష్టంగా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నదీ వివరించారు. ఈ సమావేశానికి ముందు దగ్గుబాటి దంపతులను ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణరాజు శ్రీనివాసరావులు కలిశారు. సుమారు గంటకు పైగా మంతనాలు జరిపారు. బీజేపీలో చేరుతున్నానని చెప్పగానే వారు కార్యకర్తల సమావేశానికి హాజరుకాకుండా వెళ్లిపోయారు. తాము బీజేపీలోకి రాలేమని వారు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ఎమ్మెల్యేలు పార్టీ వీడే విషయంపై మాత్రం పురందేశ్వరి ఏమీ వ్యాఖ్యానించలేదు.
కార్యకర్తలు ఫైర్.. : సమావేశంలో పురందేశ్వరి వ్యవహరించిన తీరు కార్యకర్తలను అయోమయంలోకి నెట్టింది. విభజన బిల్లుకు మద్దతిచ్చిన పురందేశ్వరి చేరుతున్నారని కార్యకర్తలు, అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. ఇంతవరకు పార్టీని.. ఆమెను అంటిపెట్టుకొని ఉన్న కొందరు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తంచేశారు. యువజన కాంగ్రెస్ నగర మాజీ అధ్యక్షుడు పీతల మూర్తి యాదవ్, పురందేశ్వరి ముఖ్య అనుచరులు మిలీనియం శ్రీధరరెడ్డి, రాగతి అచ్యుతరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పురందేశ్వరిది పచ్చి అవకాశవాదమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వల్ల కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన ఆమె విభజన సాకుతో బయటకు వచ్చి విభజనకు అనుకూలమైన పార్టీలో చేరడమేమిటని ప్రశ్నించారు.