మరణించిన చెక్కా లింగేశ్వరరెడ్డి, మాకారపు సంధ్య భార్గవి
సాక్షి, అడ్డతీగల(తూర్పు గోదావరి) : ప్రేమ వ్యవహారం ఇద్దరు యువతీ యువకుల ప్రాణాలను తీసింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక.. పెద్దలు వారి ప్రేమ వివాహానికి అంగీకరించరనే అనుమానంతో ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అడ్డతీగల మండలం డి.భీమవరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిది.. డి.భీమవరానికి చెందిన చెక్కాలింగేశ్వరరెడ్డి(20), మాకారపు సంధ్య భార్గవి(19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు మందలించి కులాల వేర్వేరు కావడంతో వివాహం కుదరదని చెప్పి ముందు చదువులపై దృష్టి సారించమని చెప్పారంటున్నారు. అయినా ఇద్దరు ప్రేమ కొనసాగించడంతో ఆఖరికి పెద్దలు వివాహం చేయడానికి చూస్తామని చదువులు పూర్తి చేయమని ఇరువురికి హామీ ఇచ్చారు.
నమ్మకం కలగని వీరిద్దరూ పెద్దలను బెదిరించి తమ దారికి తెచ్చుకుందామని తలచి ఈనెల 15న మండలంలోని పింజరికొండకు వెళ్లి వారి వెంట తీసుకువెళ్లిన పురుగు మందును తొలుత సంధ్య భార్గవి తాగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను లింగేశ్వరరెడ్డి అక్కడి స్థానికుల సహాయంతో అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అదే రోజు మెరుగైన వైద్యం కోసం కాకినాడ రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన చెక్కా లింగేశ్వరరెడ్డి పింజరికొండ చేరుకుని అక్కడ దాచిపెట్టిన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానిక గిరిజనులు గమనించి అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. లింగేశ్వరరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment