పెళ్లికూతుర్ని ప్రేమించానంటూ హంగామా
తిరుపతి : ప్రియురాలికి మరొకరితో పెళ్లి జరిపిస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు.. ఆ పెళ్లిని ఆపే యత్నం చేయడంతో వధువు బంధువులు అతగాడికి దేహశుద్ది చేశారు. వివరాల్లోకి వెళితే బెంగుళూరుకు చెందిన వెంకటేష్ , మహాలక్ష్మిని ప్రేమించాడు. అయితే మహాలక్ష్మికి ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చియించారు. వివాహాన్ని తిరుపతిలో జరిగేందుకు సన్నహాలు చేశారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తిరుపతి పరకాల మఠంలోని కళ్యాణ వేదికకు చేరుకుని పెళ్లిని ఆపాలని ప్రయత్నించాడు. మహాలక్ష్మిని ప్రేమించానని హంగామా చేయడంతో ఆమె బంధువులు అతనిపై దాడి చేసి గాయపరిచారు. పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మిని వెంకటేష్ వేధించేవాడని వధువు తరపు బంధువులు తెలిపారు. అతనికి గతంలోనే వివాహమైందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరో వైపు తాము నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేయమని అడిగితే దాడి చేశారని ప్రియుడు వెంకటేష్ ఆరోపించాడు.