ప్రేమపెళ్లి చేసుకోవడమే నేరమా..?
► యువకుడిపై యువతి కుటుంబ సభ్యుల దాడి
► ఆత్మహత్యకు యత్నించిన యువకుడు, పరిస్థితి విషమం
తిరుపతి క్రైం : వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కలసిమెలసి జీవించాలని భావించారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై దాడి చేశారు. మనస్తాపం చెందిన ఆ ప్రేమికుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన తిరుపతి రూరల్ మండలంలోని పాతకాల్వలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడి చిన్నాన్న హిరానా సాహెబ్, సోదరుడు ఖాదర్‌వల్లి కథనం మేరకు.. తిరుపతి నగరంలోని గాంధీపురంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న మౌలానా ఆజా కుమారుడు ఇబ్రహీం(28) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పాతకాల్వకు చెందిన టీటీడీ ఉద్యోగి మోహన్‌రెడ్డి, భారతి కుమార్తె శశిరేఖ బీఎస్సీ నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలోనే ఇబ్రహీం దుబాయ్‌లోని అబుదాబి లో ఉద్యోగం చేసేందుకు వెళ్లాడు. శశిరేఖ వివాహం చేసుకుందామని ఫోన్ చేసింది. దీంతో గత నెల 29న ఇబ్రహీం ఇండియాకు వచ్చాడు.
ఈ నెల 6న కడపలో పెళ్లి చేసుకున్న ప్రేమజంట
వారు 6న ముస్లిం సంప్రదాయం ప్రకారం కడపలో ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజున తిరుపతికి వచ్చి ఓ హోటల్‌లో బస చేశారు. శశిరేఖ ఇంటికి వెళ్లి తిరిగి 9న ఇబ్రహీం వద్దకు వచ్చింది. వీరిద్దరూ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న శశిరేఖ తల్లిదండ్రులకు తెలిసింది. వారు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీనిని జీర్ణించుకోలేక 10వ తేదీన ఇబ్రహీం ఆత్మహత్యకు యత్నించి కోలుకున్నాడు.
భార్య కోసం వెళ్లి..
ఇబ్రహీం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భార్య కోసం పాతకాల్వకు వెళ్లాడు. శశిరేఖ ఇంటి ముందు ఫినాయిల్ తాగాడు. దీంతో శశిరేఖకు వరుసకు చిన్నాయన, పాతకాల్వ టీడీపీ ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మరికొందరు ఇబ్రహీంను చితకబాది ఊరు బయ ట చెట్టు కింద పడేశారని బాధితుడి చిన్నాన్న హిరానా సాహెబ్, సోదరుడు ఖాదర్‌వల్లి తెలిపారు. ఈ విష యం తెలుసుకున్న తాము అక్కడికి చేరుకుని ఇబ్రహీం ను రుయాకు తరలించామన్నారు. ఇబ్రహీంకు అన్నదమ్ముడైన నాగూర్‌బాషాను అమ్మాయి ఇంటి వద్దనే బంధించారని తెలిపారు. తామంతా అక్కడకు వెళితే నాగూర్‌ను వదులుతామని తెలిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇబ్రహీం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని ఎంఆర్‌పల్లి పోలీసులు తెలిపారు.