పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు | Boyfriend who pushed his girlfriend under the tanker | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు

Published Mon, Aug 7 2023 3:23 AM | Last Updated on Tue, Aug 22 2023 8:39 PM

Boyfriend who pushed his girlfriend under the tanker - Sakshi

నిజాంపేట్‌: పాత పరిచయం కాస్త..ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం..ఒకే సామాజికవర్గం. అయినా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఎందుకో ప్రియుడికి మనసొప్పలేదు. ప్రియురాలు ఒత్తిడి తేవడంతో మట్టుబెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం నెమలిగుట్టతండాకు చెందిన ప్రమీల (22) ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం బాచుపల్లి ఏరియాకు వచ్చింది.

స్థానికంగా ఓ షోరూమ్‌లో పనికి కుదిరింది. భౌరంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో రెడ్డిల్యాబ్‌లో పనిచేసే స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. అదే మండలంలోని సోమరంపేట్‌ తండాకు చెందిన బాణావత్‌ తిరుపతి కొండాపూర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రమీలకు తిరుపతితో పాత పరిచయం ఉంది. ఐదారు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.  

పెళ్లి సంబంధాల విషయం తెలుసుకొని..  
తిరుపతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. విషయం తెలుసుకున్న ప్రమీల పెళ్లి చేసుకుందామంటూ తిరుపతిపై కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తుండగా, వాయిదా వే స్తూ వస్తున్నాడు. ఇటీవల ప్రమీల తన స్వగ్రామానికి వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి తిరిగివచ్చింది. అయితే ప్రమీల శనివారం రాత్రి 9 గంటల తర్వాత గాయాలతో రూ మ్‌కు వచ్చిందని ఆమె స్నేహితురాళ్లు చెప్పా రు. అయితే పెళ్లి విషయంలో తిరుపతితో గొడవ జరిగి ఉంటుందని తెలిసింది.
 
మాట్లాడుకుందామని రమ్మంటే.... 
ప్రమీల ఆదివారం ఉదయం తిరుపతికి ఫోన్‌ చేసింది. ఎప్పుడూ కలుసుకునే బాచుపల్లి వీఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్దకు రమ్మని చెప్పింది. ఉదయం పదిన్నర ప్రాంతంలో తిరుపతి అక్కడకు రాగా, ఇద్దరూ గంటన్నరకుపైగా మాట్లాడుకున్నారు. పెళ్లి విషయమై ప్రమీల ఎంత ఒత్తిడి చేసినా తిరుపతి ఒప్పుకోలేదు.

నేను వెళుతున్నానంటూ తిరుపతి రోడ్డు దాటేందుకు వెళుతుండగా, ప్రమీల కూడా అతనిని అనుసరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ రోడ్డు మధ్యలో డివైడర్‌ మీదనే ఉన్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాచుపల్లి వైపు వస్తున్న ఓ ట్యాంకర్‌ను తిరుపతి గమనించాడు.

ట్యాంకర్‌ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రమీలను తోసేశాడు. దీంతో ట్యాంకర్‌ ఢీకొని ప్రమీల అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు 108కు కాల్‌ చేశారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement