ఎల్లలు దాటినప్రేమ!
- పారిస్ అమ్మాయి...తిరుపతి అబ్బాయి !
- ఈ ఏడాది జనవరిలో పారిస్‌లో ఒక్కటైన జంట
- ప్రస్తుతం పెద్దల సమక్షంలో ఘనంగా రిసెప్షన్
తిరుపతి సిటీ : వీరి ప్రేమ ఖండాంతరాలు దాటింది. దేశాల మధ్య దూరం ఎక్కువైనా.. ఒకరినొకరు ఇష్టపడి మనసుల మధ్య దూరం తక్కువే అని చాటిచెప్పారు. ఆరేళ్లు ప్రేమించుకుని పెద్దలను మెప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్‌కు చెందిన ఓ అమ్మాయి.. తిరుపతికి చెందిన అబ్బాయి పెళ్లితో ఒక్కటయ్యారు. శుక్రవారం తిరుపతిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వివరాలిలా..
కపిలతీర్థం రోడ్డులో నివసిస్తున్న రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి బి.శ్రీరాములు, మునిలక్ష్మిల కుమారుడు బాలసుబ్రమణ్యం 2008లో చదువుకోసం పారిస్ వెళ్లాడు. అక్కడ హీమ, అడుడాల కుమార్తె ఏస్తర్‌తో పరిచయం ఏర్పడింది. 2009లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. ఈ ఏడాది జనవరి 31న పారిస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దంపతులిద్దరూ తిరుపతికి వచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు నగరంలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో బాలసుబ్రమణ్యం తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఇక్కడి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పారిస్ నుంచి ఏస్తర్ ఇద్దరు అన్నయ్యలు, స్నేహితురాలు సైతం వచ్చారు. రిసెప్షన్‌కు వెళ్లిన వారంతా నవ దంపతులతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. ఏస్తర్ పారిస్‌లో ఉద్యోగం చేస్తోంది. వీరు త్వరలో పారిస్‌లో కాపురం పెట్టనున్నారు.