
సాక్షి,చోడవరం(విశాఖపట్టణం): మండలంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని పద్మావతి(17) హత్య కేసులో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, జువైనల్‌హోంకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ కేవీ రమణ మీడియాకు తెలిపారు. ప్రియుడు రాజాప్రసన్నకుమార్ తన స్నేహితులు శ్రీనివాస్, సాయిశంకర్‌లతో కలసి పథకం ప్రకారం ఈ హత్య చేశాడని ఆయన చెప్పారు.
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. పద్మావతి, ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజా ప్రసన్నకుమార్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు గర్భవతి అయిన విషయం తెలుసుకున్న రాజాప్రసన్నకుమార్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి పద్మావతి నిరాకరించడంతో ప్రియుడు రాజాప్రసన్నకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల సహకారంతో చోడవరం శివారులోని ఫారెస్టు డిపో సమీపంలోకి పద్మావతిని తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201,376,379, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.