chodavaram mandal
-
ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్‌పేటకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్‌ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్‌తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్‌ను మోటారు సైకిల్‌పై, తన ఒంటిపై పోసుకున్నాడు. మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్‌పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు. ఘటనలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్‌ప్రసాద్‌కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణత్యాగానికి సిద్ధం ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్ చేశారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
ప్రేమికుడే చంపేశాడు..!
సాక్షి,చోడవరం(విశాఖపట్టణం): మండలంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని పద్మావతి(17) హత్య కేసులో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, జువైనల్‌హోంకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ కేవీ రమణ మీడియాకు తెలిపారు. ప్రియుడు రాజాప్రసన్నకుమార్ తన స్నేహితులు శ్రీనివాస్, సాయిశంకర్లతో కలసి పథకం ప్రకారం ఈ హత్య చేశాడని ఆయన చెప్పారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. పద్మావతి, ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజా ప్రసన్నకుమార్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు గర్భవతి అయిన విషయం తెలుసుకున్న రాజాప్రసన్నకుమార్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి పద్మావతి నిరాకరించడంతో ప్రియుడు రాజాప్రసన్నకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల సహకారంతో చోడవరం శివారులోని ఫారెస్టు డిపో సమీపంలోకి పద్మావతిని తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201,376,379, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. -
నీరు లేక వరికి నిప్పు
తాము పొలంలో నాటేది విత్తో విపత్తో అంతుచిక్కని దయనీయ పరిస్థితి రైతాంగానిది. ఏటా అతివృష్టి,అనావృష్టితో నష్టాలే. హుద్‌హుద్ ధాటికి నేలకొరిగిన వరిని సుడిదోమ ఆశించింది. దానికి వర్షాభావ పరిస్థితులు తోడవ్వడంతో పంట ఎండిపోయి పనికిరాకుండాపోయింది. చోడవరం మండలం దామునాపల్లిలో సుమారు వంద ఎకరాల వరి పంటను రైతులు మంగళవారం తగులబెట్టారు. చోడవరం : వరి రైతు గుండె దిగాలు పడింది. ఎండుతున్న పంటను చూసి రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఎక్కడ చూసినా వరి రైతుల వేదనే వినిపిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు అన్నీ అడ్డంగులే ఎదురయ్యాయి. వర్షాలు సకాలంలో కురవక అష్టకష్టాలు పడి సీజన్ ఆఖరి రోజుల్లో నాట్లు వేశారు. ఆలస్యంగా నాట్లు వేసినా పంట చేతికొస్తే తిండి గింజలైనా మిగులుతాయని రైతులంతా ఆశించిన సమయంలో హుద్‌హుద్ తుఫాన్ వచ్చిపడింది. ఈ తుఫాన్లో వర్షాలు పడకపోగా గాలులకు ఎదిగిన పంట పూర్తిగా నేలకొరిగింది. దీనికితోడు మునుపెన్నడూలేని విధంగా సుడిదోమ ఈ సారి వరి పంటను పీడించింది. ఈ తెగులును నివారించాలంటే భారీ వర్షం పడాల్సి ఉంది. కాని వర్షం పడలేదు. తెగులు సోకని పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి. ఇప్పటికీ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకకపోవడంతో కనీసం బోర్ల సాయంతోనైనా పొలాలకు నీరుపెట్టుకోని దయనీయ స్థితి ఏర్పడింది. ఇటు సుడిదోమ, అటు నీరులేక వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఎండపోయాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో సుమారు 500ఎకరాలకు పైబడి వరి పంట ఎండిపోయింది. చోడవరం మండలంలో దామునాపల్లిలోనే సుమారు వంద ఎకరాల మేర వరి పంట సుడిదోమ బారిన పడి ఎండిపోవడంతో రైతులు ఈ పంటను మంగళవారం తగులబెట్టారు. శానాపతి సత్యారావు, శానాపతి నాగేశ్వరరావు, కొయిలాపల్లి రాము, రాజు, మట్టా భాను లకు చెందినే సుమారు 65 ఎకరాలు ఒకే సారి తగులబెట్టారు. ఇప్పటి కే లక్కవరంలో రైతులు 20ఎకరాల్లో ఎండిన వరిపంటను కోసి పశువులకు వేశారు. పిడికెడు మెతుకులైనా దక్కుతాయని వేసిన పంటను ఆ చేతులతోనే తగులబెట్టే దుస్థితి రావడంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం గ్రామీణ జిల్లాను నిర్లక్షం చేస్తోందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.