నీరు లేక వరికి నిప్పు | Farmers burned the rice crop | Sakshi
Sakshi News home page

నీరు లేక వరికి నిప్పు

Published Wed, Nov 12 2014 1:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Farmers burned the rice crop

తాము పొలంలో నాటేది విత్తో విపత్తో అంతుచిక్కని దయనీయ పరిస్థితి రైతాంగానిది. ఏటా అతివృష్టి,అనావృష్టితో నష్టాలే. హుద్‌హుద్ ధాటికి నేలకొరిగిన వరిని సుడిదోమ ఆశించింది. దానికి వర్షాభావ పరిస్థితులు తోడవ్వడంతో పంట ఎండిపోయి పనికిరాకుండాపోయింది. చోడవరం మండలం దామునాపల్లిలో సుమారు  వంద ఎకరాల వరి పంటను రైతులు మంగళవారం తగులబెట్టారు.
 
చోడవరం : వరి రైతు గుండె దిగాలు పడింది. ఎండుతున్న పంటను చూసి రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఎక్కడ చూసినా వరి రైతుల వేదనే వినిపిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు అన్నీ అడ్డంగులే ఎదురయ్యాయి. వర్షాలు సకాలంలో కురవక  అష్టకష్టాలు పడి సీజన్ ఆఖరి రోజుల్లో నాట్లు వేశారు.   ఆలస్యంగా నాట్లు వేసినా  పంట చేతికొస్తే తిండి గింజలైనా మిగులుతాయని రైతులంతా ఆశించిన సమయంలో హుద్‌హుద్ తుఫాన్ వచ్చిపడింది. ఈ తుఫాన్‌లో వర్షాలు పడకపోగా గాలులకు ఎదిగిన పంట పూర్తిగా నేలకొరిగింది. దీనికితోడు మునుపెన్నడూలేని విధంగా సుడిదోమ ఈ సారి వరి పంటను పీడించింది.   ఈ తెగులును నివారించాలంటే భారీ వర్షం పడాల్సి ఉంది. కాని వర్షం పడలేదు. తెగులు సోకని పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి.

ఇప్పటికీ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకకపోవడంతో కనీసం బోర్ల సాయంతోనైనా పొలాలకు నీరుపెట్టుకోని దయనీయ స్థితి ఏర్పడింది. ఇటు సుడిదోమ, అటు నీరులేక వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఎండపోయాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో సుమారు 500ఎకరాలకు పైబడి వరి పంట ఎండిపోయింది. చోడవరం మండలంలో దామునాపల్లిలోనే సుమారు  వంద ఎకరాల మేర వరి పంట సుడిదోమ బారిన పడి ఎండిపోవడంతో రైతులు ఈ  పంటను మంగళవారం తగులబెట్టారు.

శానాపతి సత్యారావు, శానాపతి నాగేశ్వరరావు, కొయిలాపల్లి రాము, రాజు, మట్టా భాను లకు చెందినే సుమారు 65 ఎకరాలు ఒకే సారి తగులబెట్టారు. ఇప్పటి కే లక్కవరంలో రైతులు 20ఎకరాల్లో ఎండిన వరిపంటను కోసి పశువులకు వేశారు. పిడికెడు మెతుకులైనా దక్కుతాయని వేసిన పంటను ఆ చేతులతోనే తగులబెట్టే దుస్థితి రావడంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం గ్రామీణ జిల్లాను నిర్లక్షం చేస్తోందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement