కొత్తగూడెం, న్యూస్‌లైన్:
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు..’ అన్న చందంగా ఉన్నాయి ప్రభుత్వ నిర్ణయాలు. అష్టకష్టాలకోర్చి వరిసాగుచేసిన రైతులు అధికారుల వైఖరితో పంటవిక్రయంపై అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన తుపానులతో జిల్లాలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు నకిలీ విత్తనాలు, చీడ పీడలు కారణంగా ఈసారి వరి సరాసరి దిగుబడి కూడా తగ్గిపోయింది. ఇలా ఇప్పటికే నష్టాన్ని చవిచూసిన రైతులు ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన వైఖరి లేకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది నవంబర్ నెల మొదటివారంలోనే లెవీ టార్గెట్ అందించే అధికారులు ఇప్పటి వరకు మిల్లర్లకు టార్గెట్ ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద మద్దతు ధర తక్కువగా ఉండటం, బయట అమ్మకాలు చేద్దామంటే కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సుముఖంగా లేకపోవడంతో రైతులు తమ ధాన్యం అమ్మకాలు ఎలా చేయాలనే విషయంపై కలవరపడుతున్నారు.
జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు సకాలంలో కురవడం, వరి పంటకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు వదలడంతో రైతులు పూర్తిస్థాయిలో పంట సాగు చేశారు. అయితే ఇటీవల జల్, హెలెన్ తుపానుల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతోపాటు చీడ పీడల తెగులు అధికంగా ఉండటం, ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నకిలీవి కావడంతో ఈ ప్రభావం వరి సాగుపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితుల్లో 8.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే వరి ఈసారి కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
కోతలు ప్రారంభించినా ఖరారు కానీ లెవీ..
ప్రతి ఏడాది ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ ముతక, దొడ్డు రకం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోనే ఎక్కువగా వరి సాగు అయింది. సాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసే రైతులు సన్నరకం ధాన్యాన్ని పండిస్తుంటారు. ప్రతి ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు సన్నరకం ధాన్యం జిల్లాలో ఉత్పత్తి అవుతున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రతి కూల పరిస్థితులు నెలకొనడంతో సన్నరకం ధాన్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది సన్నరకం ధాన్యం లెవీ టార్గెట్ ద్వారా మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 90 పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు లెవీ టార్గెట్ నిర్ణయించకపోవడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.
మద్దతు ధరకంటే బహిరంగ ధర అధికం..
ప్రస్తుతం దిగుబడి అవుతున్న వరి ధాన్యంలో సుమారు 25 శాతం తేమ ఉంటున్నప్పటికీ ప్రభుత్వం అందించే మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర రావడం, బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు లెవీ టార్గెట్ లేక మిల్లరు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ముతక, దొడ్డు రకం ధాన్యం క్వింటాకు రూ.వెయ్యి అందిస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.1200ల వరకు ధాన్యం ధర పలుకుతోంది. దీనికి తోడు సన్నబియ్యంకు మద్దతు ధర క్వింటాకు రూ.1,200లు అందిస్తుండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.1,500ల వరకు మద్దతు ధర అందుతుంది.
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు భయపడుతుండటంతో తక్కువ ధరకు రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలే దిగుబడి తగ్గి పెట్టుబడులు వస్తాయో రావో అని నిరాశలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో ధాన్యం అమ్మకాలు చేసేలా మిల్లర్లకు లెవీ అందించాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే ఇదే అదనుగా దళారులు ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించే అవకాశాలు లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు.
పెట్టుబడి దక్కేనా..?
Published Sun, Dec 8 2013 3:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement