
తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటుందనే....
అల్లూరు : మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి అల్లూరు చెరువులో హత్యకు గురైన విషాద సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. కోవూరు సీఐ అశోకవర్ధన్, అల్లూరు ఎస్‌ఐ చల్లా వాసు కథనం మేరకు.. అల్లూరు వడ్డిపాళెంకు చెందిన వల్లెపు స్వప్నప్రియ, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన వల్లూరు తిరుమలకుమార్ కావలిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గతేడాది ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. అయితే తరచూ ఫోన్లో సంభాషించుకుంటూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో స్వప్నప్రియ తన స్నేహితుడు తిరుమలకు రెండున్నర సవర్ల బంగారు చైన్ కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో స్వప్నప్రియకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉంది. దీంతో తనకు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారని, తానిచ్చిన చైన్ తనకు ఇవ్వాలని వారం రోజులుగా తిరుమలకు ఫోన్ చేసి అడుగుతూ ఉంది. అయితే స్వప్న తనను కాదని మరొకరిని వివాహమాడటం ఇష్టం లేని తిరుమల ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసి అల్లూరు కస్తూరిదేవి పార్కు ప్రాంతానికి వచ్చి తన వద్దకు రమ్మన్నాడు. దీంతో స్వప్న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తిరుమల వద్దకు వెళ్లింది.
అనంతరం ఇద్దరూ కలిసి అల్లూరు-పల్లిపాడు మధ్యన ఉన్న చెరువుకట్ట ప్రాంతానికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ..తిరుమల ముందుగా తనతో తెచ్చుకున్న చాకుతో ఆమె గొంతు కింది భాగాన పొడిచాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో జుట్ట పట్టుకుని చెరువులోకి లాక్కెళ్లి తలను పూర్తిగా ముంచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు. స్వప్న ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వల్లెపు పద్మజ, బంధువులు బుధవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం స్వప్నకు సన్నిహితుడైన తిరుమలను అనుమానించారు. బుచ్చిరెడ్డిపాళెంకు వెళ్లి నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు చెరువు ప్రాంతంలో పరిశీలించగా చెట్ల మధ్య స్వప్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా మృతదేహం నీటిలో ఉండటంతో ముఖమంతా బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టలేనంతగా తయారైంది.
కాళ్లు చేపలు తిని పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో మృతదేహాన్ని ఎక్కువసేపు బంధువులు సైతం చూడలేకపోయారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు తిరుమలను శుక్రవారం కోర్టుకు హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.