
ఓ ప్రియుడి దారుణం
సామర్లకోట : స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి ఓ వ్యక్తి ఏడాది బాలుడు, ఓ వివాహితను చెరువులోకి తోసేసిన సంఘటన ఇది. సామర్లకోట పోలీసుల కథనం ప్రకారం... కిర్లంపూడి మండలం వేలంకి గ్రామానికి చెందిన మణి ఏడాదిగా భర్త బాలరాజు నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. మూడు నెలలుగా అదే గ్రామానికి చెందిన లారీ క్లీనర్ శేషుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మణి, ప్రియుడు శేషు స్థానిక ఓవర్‌బ్రిడ్జిపై ఘర్షణ పడ్డారు.
దీంతో శేషు ఆగ్రహించి, బ్రిడ్జిపై నుంచి తల్లి, బిడ్డను సుమారు 25 అడుగుల దిగువలోనున్న చెరువులోకి నెట్టేశాడు. దీంతో మణి తన ప్రాణాలను రక్షించుకొనే ప్రయత్నంలో ఈదుకుంటూ చెరువు నుంచి బయటపడింది. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ సిబ్బంది ఆమెను ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచి, సామర్లకోట పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చెరువులో మునిగిపోయిన ఏడాది బాలుడు చనిపోయి చెరువులో తేలుతూ కనిపించాడు. పోలీసులు మణి నుంచి సమాచారం సేకరించారు. మణి ప్రియుడు పరారయ్యాడు. మణి ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు ఎండీ అలీఖాన్, నాగార్జున పరిశీలించారు.