విషాదాంతమైన ప్రేమకథ
టెక్కలి, న్యూస్‌లైన్: వారిద్దరూ కళాశాల విద్యార్థులు.. ప్రేమించుకున్నారు.. పెళ్లిచేసుకుందామనుకున్నారు.. ఏమైందో కానీ వారి మృతదేహాలు బావిలో తేలాయి. ఆత్మహత్య చేసుకున్నారనే ఊహాగానాలు సాగుతున్నా.. మృతుల నోరు, ముక్కు నుంచి వచ్చిన నురగలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. టెక్కలిలో మంగళవారం కలకలం రేపిన సంఘటన వివరాల్లోకి వెళితే...
టెక్కలి భూలోకమాత వీధికి చెందిన మండల రమేష్, లక్ష్మి కుమార్తె రేష్మ (17). పట్టణంలోని తెలుగు బ్రాహ్మణ వీధికి చెందిన నామాల కూర్మారావు, సుజాత కుమారుడు రమణ అలియాస్ దామోదర్ (18). టెక్కలిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న వారిద్దరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వారి ప్రేమగాథ పెద్దలకు తెలిసింది. మంగళవారం రేష్మా పరీక్ష రాసేందుకు వెళ్లింది. తిరిగి రాలేదు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తీసుకువెళుతున్నట్లు రేష్మా తండ్రి రమేష్‌కు దామోదర్ ఫోన్ చేశాడని చెబుతుతున్నారు. కాగా, దామోదర్ రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి కూర్మారావు చెప్పారు. పరీక్ష కు వెళ్లిన రేష్మా రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం సమీపంలో గల నేలబావిలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు తీశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దామోదర్ స్నేహితులు సంతోష్, ప్రశాంత్, మధుసూదన్‌లను ఆవేదన, ఆగ్రహంతో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. యువతి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న ఎస్సై నర్సింహమూర్తి ఘటన స్థలానికి చేరుకుని యువకులను తమ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బావిలో గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.ప్రేమజంట ఆత్మహత్య సమాచారం తెలియడంతో పట్టణ ప్రజలు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతుల నోటి వెంట నురగ
కాగా, ప్రేమజంట ఆత్మహత్యపై పలు ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెద్దల అనుమతి ఉండదని ఆత్మహత్యకు చేసుకున్నారని కొందరు, వేరే కారణాలు ఉన్నామని మరికొందరు అంటున్నారు. కానీ ఇరువురి నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చినట్లు కనిపిస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం జరిగిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
ఉత్సవాల వేళ విషాదం...
స్థానిక భూలోకమాత వీధిలో నాలుగు రోజుల నుంచి గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారంతో ఉత్సవాలు ముగియనుండగా, అదే వీధికి చెందిన రేష్మా ఆత్మహత్యతో విషాదం అలముకుంది.