పోలీసులు పెళ్లిచేసిన భానుప్రకాశ్, వరలక్ష్మి
సాలూరురూరల్(పాచిపెంట): ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఏకమైంది. ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి అబ్బాయి తరపు వాళ్లు అడ్డుపడి, వేరే అమ్మాయితో పెళ్లికి ముహుర్తం కూడా తీసేశారు. విషయం తెలుసుకున్న అమ్మాయి స్థానికంగా ఉన్న స్ఫూర్తి మహిళా మండలి సభ్యులను ఆశ్రయించారు.
వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు ప్రేమపక్షుల పెళ్లి జరిగింది. ఎస్టీ,ఎస్సీ సెల్ డీఎస్పీ గురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీ గంగందొరవలస గ్రామానికి చెందిన పండిక వరలక్ష్మీ అనే అమ్మాయి, అదే మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర భానుప్రకాశ్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ప్రేమించుకున్నారు.
అమ్మాయి ఎస్టీ, అబ్బాయి బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమవడంతో అమ్మాయి. స్థానిక స్ఫూర్తి మహిళా మండల అధ్యక్షురాలు బలగ రాధను ఆశ్రయించారు.
ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సన్యాసినాయుడు ఇరువర్గాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి తరపు వాళ్లు అంగీకరించనప్పటికీ ఇద్దరు మేజర్లు కావడంతో తొలుత అమ్మాయి ఇంటి వద్ద గంగందొరవలసలో వివాహం చేసి, తర్వాత సాలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment