అల్పపీడనంగా వాయుగుండం
జార్ఖండ్, ఒడిశాలపై కేంద్రీకృతం ఇరు రాష్ట్రాలకు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం తీరం దాటిన వాయుగుండం సోమవారం ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ఒడిశాకు ఆనుకుని జార్ఖండ్‌పై ఆవరించి ఉంది. ఫలితంగా నాలుగు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విరామం దొరికింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. కోస్తాంధ్ర, తెలంగాణలపై నైరుతి రుతుపవనాలు ఒకింత చురుగ్గా ఉన్నాయి.
దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రానున్న 24 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం నాటి నివేదికలో తెలిపింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వానలు కురవవచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.