వర్షాలు మరికొన్నాళ్లు కొనసాగడానికి వాతావరణం అనుకూలంగా మారుతోంది.
సాక్షి, విశాఖపట్నం: వర్షాలు మరికొన్నాళ్లు కొనసాగడానికి వాతావరణం అనుకూలంగా మారుతోంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు, నైరుతి రుతుపవనాల చురుకుదనంతో ఏపీ, తెలంగాణలో ఆశాజనకంగా వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలం పుంజుకుంటోంది. దీంతో మరో మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమలో బలంగాను, కోస్తాంధ్రలో మోస్తరుగాను ప్రభావం చూపుతున్నాయి. అంతేగాక ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఆంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.