
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న మరో మూడు రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని ఢిల్లీలోని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మే 3 వరకు భారీ వర్షాలు , వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
మే 5 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని, దీనికి ముందుకు దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం వరకు అనేక రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. మే 3 వరకు ఇలానే ఉంటుందని, మే4 నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఐఎండీ తెలిపింది.
ఈ వర్షాలకు వాయువ్య భారతదేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ పేర్కొన్నారు. గతనెలలో వాతావరణ విభాగం వార్షిక సూచనలో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేయగా, ప్రస్తుతం సాధారణం కంటే.. దాదాపు 67% పైగా వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఈ అకాల వర్షాలకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి.
ఇదిలాఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమవడంతో సెంట్రల్ ఢిల్లీలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
(చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం!)
Comments
Please login to add a commentAdd a comment