న్యూఢిల్లీ: గత 121 సంవత్సరాల (1901) నుంచి చూస్తే 2021 సంవత్సరం ఐదవ వెచ్చని సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన వార్షిక వాతావరణ నివేదికలో స్పష్టం చేసింది. అంతకంటే ముందు 2009, 2010, 2016, 2017లు మొదటి నాలుగు వెచ్చని సంవత్సరాలుగా నిలిచాయి. 2021లో సగటు గాలి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.44 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని వాతవరణ శాఖ నివేదిక పేర్కొంది. 2016లోసగటు గాలి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.71 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండగా.. 2009లో 0.55 డిగ్రీల సెల్సియస్.. 2017లో 0.54 డిగ్రీల సెల్సియస్.. 2010లో 0.53 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు తెలిపింది.
కాగా 1901 నుంచి 2022 వరకు గత 121 సంవత్సరాలలో సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.63°C పెరిగింది. వెచ్చని శీతాకాలం. రుతుపవనాల అనంతర కాలంలో వెచ్చగా ఉండే ఉష్ణోగ్రత దీనికి దోహదపడింది. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి శీతాకాల నెలలలో సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.78 డిగ్రీల సెల్సియస్, అక్టోబర్ -డిసెంబర్ మధ్య, సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.42°C ఎక్కువగా ఉంది.
చదవండి: పిల్లలకు థర్డ్‌వేవ్ ఎక్కువ ప్రమాదకరం.. వైద్యులేమంటున్నారంటే..
అలాగే గత సంవత్సరం దేశంలో అధిక వర్షపాతం నమోదైంది. ఇది దాని దీర్ఘ-కాల సగటు(లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 105%ఎక్కువ. నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం ఎల్‌పీఏలో 99% ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎల్‌పీఏలో 171% వర్షపాతం నమోదైంది.ఇది 1901 నుండి అత్యధికంగా నమోదైంది.
ఇక గతేడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 1,750 మంది మరణించారు. ఉరుములు, మెరుపులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనీసం 780 మంది మరణించారు. 2021లో ఐదు తుఫానులు వచ్చాయి. అరేబియా సముద్రం మీదుగా తౌక్టే (మే 14-19), బంగాళాఖాతం మీదుగా యాస్ (మే 23-28); అరేబియా సముద్రం మీదుగా షాహీన్ (సెప్టెంబర్ 29-అక్టోబర్ 4); బంగాళాఖాతం మీదుగా గులాబ్ (సెప్టెంబర్ 24-28) మరియు ఇటీవల, బంగాళాఖాతం మీదుగా జవాద్ (డిసెంబర్ 2-6). వీటితో అత్యంత వినాశకరమైనది తౌక్డే, ఇది మే 17న సౌరాష్ట్ర తీరప్రాంతాన్ని కుదిపేసింది. వీటి వల్ల కనీసం 144 మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’
Comments
Please login to add a commentAdd a comment