Weather office
-
మండే ఎండల్లో వర్ష సూచన: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు. -
IMD: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు..
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న మరో మూడు రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని ఢిల్లీలోని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మే 3 వరకు భారీ వర్షాలు , వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మే 5 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని, దీనికి ముందుకు దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం వరకు అనేక రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. మే 3 వరకు ఇలానే ఉంటుందని, మే4 నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాలకు వాయువ్య భారతదేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ పేర్కొన్నారు. గతనెలలో వాతావరణ విభాగం వార్షిక సూచనలో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేయగా, ప్రస్తుతం సాధారణం కంటే.. దాదాపు 67% పైగా వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఈ అకాల వర్షాలకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలాఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమవడంతో సెంట్రల్ ఢిల్లీలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. (చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం!) -
పిడుగు ఎక్కడ పడుతుందంటే...
సాక్షి, ముంబై: వర్షాకాలంలో పిడుగు పడి మృతి చెందుతున్న ఘటనలను అరికట్టేందుకు వాతావరణశాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పిడుగులను గుర్తించే కొత్త యంత్రాన్ని కనిపెట్టడంలో ఈ శాఖ సఫలీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏ సమయంలో పిడుగులు పడతాయో అరగంట నుంచి రెండు గంటల ముందే తెలియజేసే సెన్సార్లను ఇది ఐఐటీ నుంచి సేకరించింది. వీటిని రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వచ్చే వర్షాకాలం నుంచి ఈ సెన్సార్లు పనిచేయడం ప్రారంభస్తాయని ముంబై వాతావరణ శాఖ కార్యాలయం తెలిపింది. వర్షాకాలం వచ్చిందంటే రైతులు, వారి దగ్గర పనిచేసే కూలీల్లో గుబులు మొదలవుతుంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో అనేకచోట్ల పిడుగులు పడతాయి. పశువుల పాకలు, చెట్టు కింద తలదాచుకున్నా అక్కడ కూడా పిడుగులు పడుతున్నాయి. దీంతో ఏటా వందలాది మంది రైతులు, కూలీలు దుర్మరణం పాలవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు వాతావరణశాఖ పుణే ఐఐటీని సంప్రదించింది. ఈ సంస్థే పిడుగులు గుర్తించే సెన్సార్లను తయారు చేసి ఇచ్చిందని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. వీటి నియంత్రణ కేంద్రం (కంట్రోల్ రూం) ఐఐటీ కార్యాలయంలో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కడ, ఏ స్థాయిలో పడతాయనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని ఈ ప్రాజెక్టు చీఫ్, ఐఐటీ సీనియర్ శాస్త్రజ్ఞులు డాక్టర్ సునీల్ పవార్, వి.గోపాలకృష్ణ, పి.ముర్గువెల్ వెల్లడించారు. వీటి తయారీకి అమెరికాకు చెందిన అర్థ్ నెట్వర్క్ అనే కంపెనీ నుంచి పరికరాలను దిగుమతి చేసుకున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం, అవి ఏ స్థాయిలో నేలపై పడతాయి తదితర కీలక అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుపడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ సెన్సార్లు 200-250 కిలోమీటర్ల దూరంలోని పిడుగుల వివరాలను కూడా తెలియజేస్తాయి. ఐఐటీ వెబ్సైట్లో స్థానికులు తమ మొబైల్ నంబర్లు, గ్రామం పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి వాతావరణ వివరాలు అందులో లభిస్తాయని పవార్ అన్నారు. అయితే వర్షాకాలంలో ప్రతీ ఐదు, పది నిమిషాలకు ఒకసారి ఎస్ఎంఎస్లు పంపడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నామని పవార్ తెలిపారు. వీటిని ఎక్కడ ఏర్పాటు చేశారు........... మధ్య మహారాష్ట్ర-పుణే, మహాబలేశ్వర్, కొల్హా పూర్, షోలాపూర్, నాసిక్, జల్గావ్, నందూర్బార్. కొంకణ్ రీజియన్-ముంబై, హరిహరేశ్వర్ , రత్నగిరి, వెంగుర్లే. మరఠ్వాడా రీజియన్-ఔరంగాబాద్, బీడ్, లాతూర్, పర్భణి విదర్భ రీజియన్-నాగపూర్, అకోలా, యవత్మాల్, గోండియా, చంద్రపూర్