
ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి
గోపాలపురం, న్యూస్‌లైన్: జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించేవారు తాము ఎదుగుతున్న కొద్ది ఒదిగి ఉండాలని సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని హసన్‌పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘హోప్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబోస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మంచి పనులు చేసే వారు చిరకాలం గుర్తుంటారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనంలోనే లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకుసాగి తల్లి దండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను క్రమశిక్షణతో అభ్యసించే వారిక మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని చల్లగరిగె గ్రామాని కి చెందిన తాను సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 20 ఏళ్లయిందని, ఇప్పటివరకు 750 సినిమాలకు 2800ల పాటలురాశానని వివరించారు. అనంతరం ‘ నేనున్నానని.. నీకేం కాద ని’ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. పంచదార బొమ్మ.. బొమ్మ అంటూ పాటలుపాడడంతో విద్యార్థులు పులకించిపోయారు.
వారిని ఆదర్శంగా తీసుకోవాలి : ప్రొఫెసర్ రాజారాం
విద్యార్థులు స్వామివివేకానందుడు, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌లను ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలని తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్, హోప్ స్వచ్ఛంద సంస్థ మార్గదర్శకుడు కంకటి రాజారాం పిలుపునిచ్చారు. హసన్‌పర్తికి చెందిన కొంతమంది యువకులు తొమ్మిదేళ్ల క్రితం హోప్ స్వచ్ఛంద సంస్థ ను నెలకొల్పి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరి ష్కరిస్తున్నారని తెలిపారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, మేచినేని కిషన్‌రావు మాట్లాడు తూ అన్నిదానాల కంటే నేత్రదానం గొప్పదన్నారు.
రామకృష్ణ మిషన్ సభ్యుడు లక్ష్మణాచార్యులు మా ట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నెలకొల్పి పోరాడిన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ను విద్యార్థులు మరువొద్దని కోరారు. అనంతరం హోప్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ముక్తీశ్వర్, శివకుమార్‌తోపాటు హసన్‌పర్తిలో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగిన సుమారు 150 మందిని జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే చంద్రబోస్ తల్లిదండ్రులు నర్సయ్య, మధునమ్మతోపాటు ప్రొఫెసర్ రాజారాం ను కూడా నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమానికి ముందు చంద్రబోస్ స్వామివివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.