రేణిగుంట, న్యూస్‌లైన్: ఏకష్టం వచ్చినా తోబుట్టువులా అండగా ఉంటానని రేణిగుంట మండలం జీవగ్రామ్‌కు చెందిన మోజస్ భగవాన్‌దాస్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కేఎల్‌ఎం హాస్పిటల్ సమీపంలోని జీవగ్రామ్‌కు చెందిన మోజస్ భగవాన్‌దాస్ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. బాధిత కుటుంబాన్ని జననేత బుధవారం రాత్రి ఓదార్చారు.
ముందుగా కుటుంబ సభ్యుల వివరాలు, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారంటూ మోజస్ భగవాన్‌దాస్ భార్య సులోచనమ్మను వివరాలు అడిగారు. పింఛన్ వస్తోందా, రేషన్‌కార్డు ఉందా, ఇంటి స్థలం ఉందా అని అడిగారు. రేషన్ కార్డు, పింఛను, ఇంటి స్థలం కోసం అర్జీలు పెట్టుకున్నామని ఆమె తెలిపారు. కుమారుడు హెర్బెట్ సునీల్‌కుమార్ కూలి పనికి వెళితేనే కుటుంబ పోషణ జరుగుతుందని చెప్పారు. మోజస్ భగవాన్‌దాస్ కుమార్తె దేవకుమారి, అల్లుడు అబ్రహాం ఆనంద్‌రాజ్‌ను ఎక్కడ ఉంటున్నారు, ఏం పనులు చేస్తున్నారని అడిగారు.
దేవకుమారి దత్తతకు తీసుకున్న చిన్నారి గ్లోరీని ఆశీర్వదించి ముద్దాడారు. నాలుగు నెలల్లో మంచి రోజులు వస్తాయని, అన్ని విధాలా ఇంటి పెద్ద కొడుకునై ఆదుకుంటానని సులోచనమ్మకు భరోసా ఇచ్చారు. తన తరపున పార్టీ నేతలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సంప్రదించాలన్నారు. వీరి సమస్యలను స్వయంగా పరిష్కరించాలని బియ్యపు మధుసూదన్‌రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డికి సులోచనమ్మ ఆప్యాయంగా పాయసం తినిపించారు. అనంతరం తమలాంటి కుటుంబాలను ఆదుకుంటూ పేదల కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కావాలంటూ ఆమె ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, మండల కన్వీనర్ అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జువ్వల దయాకర్‌రెడ్డి, గాజులమండ్యం సర్పంచ్ శ్రీరాజ్, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
తోబుట్టువులా అండగా ఉంటా..
Published Thu, Jan 30 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement