కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : అక్షరజ్ఞానం కూడా లేని ఓ అమాయక రైతు అవినీతి భరతం పట్టాడు. పహణీ ఇచ్చేం దుకు లంచం కావాలంటూ మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న వీఆర్వోను ఏసీబీకి పట్టిం చాడు. అడిగినంత ఇచ్చుకోవడమే తప్ప.. ప్రశ్నించడం ఎరుగని తనలాంటి సామాన్యులకు ఆదర్శంగా నిలిచాడు. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రాచర్ల లింగయ్యకు 976 సర్వేనంబరులో 13గుంటల భూమి ఉంది. దానికి సంబంధించిన పహణీ కోసం మూడు నెలల క్రితం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ మేరకు పహణీ జారీ చేయాలని తహశీల్దార్ మర్రిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) మూలె సంజీవ్‌ను ఆదేశించారు.
ఇందుకోసం రూ.8వేలు ఇవ్వాలంటూ లింగయ్యను సంజీవ్ డిమాండ్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని లింగయ్య ప్రాధేయపడగా రూ.5వేలకు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని లింగయ్య తమ బంధువుల వద్ద చెప్పి ఆవేదన వెల్లగక్కాడు. ఇటీవల ఏసీబీ దాడుల గురించి పత్రికల్లో వస్తున్న వార్తలను గమనించిన బంధువులు.. ఏసీబీని ఆశ్రయించాలని ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో లింగయ్య కరీంనగర్‌లోని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌ను సంప్రదించి విషయం చెప్పాడు.
వారి సూచన మేరకు లింగయ్య సోమవారం ఉదయం రూ.5వేలు తీసుకుని వీఆర్వో సంజీవ్‌ను కలువగా, కరీంనగర్‌కు వచ్చి డబ్బులివ్వాలన్నాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంనగర్‌లోని ఓ స్వీట్‌హౌస్ వద్ద లింగయ్య నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. సంజీవ్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన సంజీవ్ 2008లో వీఆర్వోగా ఎంపికయ్యాడు. తొలి పోస్టింగ్ సొంత గ్రామంలోనే పొందిన ఆయన ఏడాదిన్నర క్రితం మర్రిపల్లి గ్రామానికి బదిలీ అయ్యాడు.
సమాచారం ఇవ్వండి..
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచాలు అడిగితే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ సూచించారు. లింగయ్య చదువు రాకున్నా వీఆర్వో అవినీతిపై తమకు
ఫిర్యాదు చేశాడని ఆయనను అభినందించారు. డీఎస్పీ సెల్‌నంబరు 94404 46150.
అవినీతి భరతం పట్టిన సామాన్యుడు
Published Tue, Oct 1 2013 4:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement