ముత్తారం, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమ శాఖలోనూ అవినీ తిపరులు తిష్టవేశారు. మాతా శిశువులకు పౌష్టికాహారం అందిస్తూ వారి సంక్షేమానికి పాటుపడాల్సిన వారు ఏంచక్కా లంచాలు మెక్కుతున్నారు. ముత్తారం మండలంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శుక్రవారం ఏసీబీ వలలో చిక్కడంతో అవినీతి బండారం బయటపడింది. ముత్తారం సెక్టార్-2లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న దొమ్మెట లక్ష్మి బాలికా సంరక్షణ పథకం ప్రొసీడింగ్ ఇచ్చేందుకు రూ.2500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. కరీంంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాలు.. ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన పంజాల సాయిలుగౌడ్‌కు ఆకాంక్ష, అక్షిత ఇద్దరు ఆడపిల్లలు. బాలికా సంరక్షణ పథ కానికి 2012లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి 28న బాలికా సంరక్షణ పథకం వర్తింపజేస్తూ కలెక్టర్, ఐసీడీఎస్ పీడీ పేరిట ప్రొసీడింగ్ కాపీమంజూరైంది. సూపర్‌వైజర్ లక్ష్మి ఆ కాపీని ఇచ్చేందుకు రూ.2500 డిమాండ్ చేశారు.
డబ్బులిస్తేనే ప్రొసీడింగ్ కాపీ ఇస్తాననడంతో సాయిలు అప్పటికప్పుడు రూ.500 ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. రూ.2000లను సూపర్‌వైజర్‌కు లద్నాపూర్‌లోని అద్దె ఇంట్లో ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఎస్సైలు వీవీ.రమణామూర్తి, శ్రీనివాస్‌రాజు పాల్గొన్నారు.
అన్యాయంగా ఇరికించారు
- లక్ష్మి, సూపర్‌వైజర్
నేను సాయిలును లంచం అడగలేదు. ఫోన్ చేసి ఇంటికి వస్తున్నా అన్నాడు. దేవుని చిత్రపటం వద్ద డ బ్బులు పెట్టాడు. లంచం ఇచ్చినట్లు అధికారులకు పట్టించాడు.
వేధింపులు తాళలేకే..
బాలికా సంరక్షణ పథకం ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలంటే రూ.2500 అడిగింది. నా వద్ద లేవని ఎన్నిసార్లు బతిమిలాడినా కనికరించలేదు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన. - సాయిలుగౌడ్, బాధితుడు
ఫిర్యాదు చేయండి
అధికారుల లంచాల కోసం వేధిస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. ఎస్సెమ్మెస్ గానీ, ఫోన్ ద్వారాగానీ, రాతపూర్వకం గానీ ఫిర్యాదు చేస్తే లంచగొండుల భరతం పడతాం. బాధితులు ఫోన్ చేయాల్సిన సెల్ నంబరు
94404 46150.
- సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ
ఐసీడీఎస్‌లోనూ అవినీతి తంతు
Published Sat, Oct 5 2013 4:50 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement