sudharshan goud
-
ఐసీడీఎస్‌లోనూ అవినీతి తంతు
ముత్తారం, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమ శాఖలోనూ అవినీ తిపరులు తిష్టవేశారు. మాతా శిశువులకు పౌష్టికాహారం అందిస్తూ వారి సంక్షేమానికి పాటుపడాల్సిన వారు ఏంచక్కా లంచాలు మెక్కుతున్నారు. ముత్తారం మండలంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శుక్రవారం ఏసీబీ వలలో చిక్కడంతో అవినీతి బండారం బయటపడింది. ముత్తారం సెక్టార్-2లో సూపర్వైజర్గా పనిచేస్తున్న దొమ్మెట లక్ష్మి బాలికా సంరక్షణ పథకం ప్రొసీడింగ్ ఇచ్చేందుకు రూ.2500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. కరీంంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాలు.. ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన పంజాల సాయిలుగౌడ్కు ఆకాంక్ష, అక్షిత ఇద్దరు ఆడపిల్లలు. బాలికా సంరక్షణ పథ కానికి 2012లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి 28న బాలికా సంరక్షణ పథకం వర్తింపజేస్తూ కలెక్టర్, ఐసీడీఎస్ పీడీ పేరిట ప్రొసీడింగ్ కాపీమంజూరైంది. సూపర్వైజర్ లక్ష్మి ఆ కాపీని ఇచ్చేందుకు రూ.2500 డిమాండ్ చేశారు. డబ్బులిస్తేనే ప్రొసీడింగ్ కాపీ ఇస్తాననడంతో సాయిలు అప్పటికప్పుడు రూ.500 ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. రూ.2000లను సూపర్వైజర్కు లద్నాపూర్‌లోని అద్దె ఇంట్లో ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఎస్సైలు వీవీ.రమణామూర్తి, శ్రీనివాస్‌రాజు పాల్గొన్నారు. అన్యాయంగా ఇరికించారు - లక్ష్మి, సూపర్వైజర్ నేను సాయిలును లంచం అడగలేదు. ఫోన్ చేసి ఇంటికి వస్తున్నా అన్నాడు. దేవుని చిత్రపటం వద్ద డ బ్బులు పెట్టాడు. లంచం ఇచ్చినట్లు అధికారులకు పట్టించాడు. వేధింపులు తాళలేకే.. బాలికా సంరక్షణ పథకం ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలంటే రూ.2500 అడిగింది. నా వద్ద లేవని ఎన్నిసార్లు బతిమిలాడినా కనికరించలేదు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన. - సాయిలుగౌడ్, బాధితుడు ఫిర్యాదు చేయండి అధికారుల లంచాల కోసం వేధిస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. ఎస్సెమ్మెస్ గానీ, ఫోన్ ద్వారాగానీ, రాతపూర్వకం గానీ ఫిర్యాదు చేస్తే లంచగొండుల భరతం పడతాం. బాధితులు ఫోన్ చేయాల్సిన సెల్ నంబరు 94404 46150. - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ -
అవినీతి భరతం పట్టిన సామాన్యుడు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : అక్షరజ్ఞానం కూడా లేని ఓ అమాయక రైతు అవినీతి భరతం పట్టాడు. పహణీ ఇచ్చేం దుకు లంచం కావాలంటూ మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న వీఆర్వోను ఏసీబీకి పట్టిం చాడు. అడిగినంత ఇచ్చుకోవడమే తప్ప.. ప్రశ్నించడం ఎరుగని తనలాంటి సామాన్యులకు ఆదర్శంగా నిలిచాడు. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రాచర్ల లింగయ్యకు 976 సర్వేనంబరులో 13గుంటల భూమి ఉంది. దానికి సంబంధించిన పహణీ కోసం మూడు నెలల క్రితం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ మేరకు పహణీ జారీ చేయాలని తహశీల్దార్ మర్రిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) మూలె సంజీవ్‌ను ఆదేశించారు. ఇందుకోసం రూ.8వేలు ఇవ్వాలంటూ లింగయ్యను సంజీవ్ డిమాండ్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని లింగయ్య ప్రాధేయపడగా రూ.5వేలకు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని లింగయ్య తమ బంధువుల వద్ద చెప్పి ఆవేదన వెల్లగక్కాడు. ఇటీవల ఏసీబీ దాడుల గురించి పత్రికల్లో వస్తున్న వార్తలను గమనించిన బంధువులు.. ఏసీబీని ఆశ్రయించాలని ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో లింగయ్య కరీంనగర్‌లోని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌ను సంప్రదించి విషయం చెప్పాడు. వారి సూచన మేరకు లింగయ్య సోమవారం ఉదయం రూ.5వేలు తీసుకుని వీఆర్వో సంజీవ్‌ను కలువగా, కరీంనగర్‌కు వచ్చి డబ్బులివ్వాలన్నాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంనగర్‌లోని ఓ స్వీట్‌హౌస్ వద్ద లింగయ్య నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. సంజీవ్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన సంజీవ్ 2008లో వీఆర్వోగా ఎంపికయ్యాడు. తొలి పోస్టింగ్ సొంత గ్రామంలోనే పొందిన ఆయన ఏడాదిన్నర క్రితం మర్రిపల్లి గ్రామానికి బదిలీ అయ్యాడు. సమాచారం ఇవ్వండి.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచాలు అడిగితే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ సూచించారు. లింగయ్య చదువు రాకున్నా వీఆర్వో అవినీతిపై తమకు ఫిర్యాదు చేశాడని ఆయనను అభినందించారు. డీఎస్పీ సెల్‌నంబరు 94404 46150. -
వీళ్లు మారరు
ఎక్కడెక్కడో ఏసీబీ దాడులు చేసుకుంటే వీరు తమకేం అనుకుంటున్నారు. అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరిస్తున్నా... ఏసీబీ నిత్యం దాడులు నిర్వహించి జైలుకు పంపిస్తున్నా... వీరు మాత్రం మారడం లేదు. లంచాలు తినమరిగి.. సామాన్యులను పీడిస్తూనే ఉన్నారు. శనివారం ఏసీబీ దాడుల్లో మరో ‘రెవెన్యూ’ చేప చిక్కింది. పహణీ నకల్ కోసం ఓ రైతు నుంచి తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామడుగు, న్యూస్‌లైన్ : రామడుగు మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన కడారి శంకర్ అనే రైతు ఈ నెల 5న పహణీ నకల్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మూల చంద్రశేఖర్‌రెడ్డిని కలవగా డబ్బులు ఇస్తే పహణీ నకల్ ఇస్తానని చెప్పాడు. దీంతో అప్పుడే రూ.వెయ్యి అందించాడు. అయినా పహణీ ఇవ్వకపోవడంతో ఈ నెల 20న మళ్లీ వెళ్లి అడగగా మరో రెండు వేలు ఇస్తేనే పహణీ ఇస్తానని చెప్పాడు. తాను అంత ఇచ్చుకోలేనని, పహణీ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ వద్దే పనిచేసుకోవాలని ఆయన సెలవివ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ చంద్రశేఖర్‌రెడ్డి వద్దకే వచ్చాడు. పైసలు ఇవ్వనిదే పహణీ ఇవ్వనని ఆయన తెగేసి చెప్పడంతో విసిగిపోయిన శంకర్ కరీంనగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ప్రణాళిక ప్రకారం శంకర్‌కు శనివారం రూ.2 వేలు ఇచ్చి పంపించారు. అతడు కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్‌కు ఆ డబ్బులు ఇవ్వగా అక్కడే ఉన్న డీఎస్పీతోపాటు ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, శ్రీనివాసరాజు, సిబ్బంది కలిసి చంద్రశేఖర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 9440446150 నంబర్‌కు ఫోన్ చేయాలని డీఎస్పీ తెలిపారు.