పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇంటి ముందు ఈ నెలాఖరున మహా ధర్నాను చేపడతామని....
వైఎస్సార్ సీపీ నాయకుడు జమ్మాన ప్రసన్న కుమార్
పార్వతీపురం: పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇంటి ముందు ఈ నెలాఖరున మహా ధర్నాను చేపడతామని పార్వతీపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ...న వంబరులో పార్వతీపురం శాసనసభ్యుడు బొబ్బిలి చిరంజీవులు జంఝావతి బ్యాలన్సు పనులు పూర్తిచేసేందుకు గాను, కావలసిన రూ.39 కోట్లు మంజూరుకు ప్రభుత్వాన్ని ఒప్పించానని, ఆ నిధులు రూ.39కోట్లు ఈ బడ్జెట్ నుంచి విడుదలవుతాయని పత్రికల్లో ఊదరగొట్టారని గుర్తుచేశారు. 2016-17 సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.3 కోట్ల రూపాయలను మాత్రమే జంఝావతి ప్రాజెక్ట్‌కు మంజూరు చేసిందన్నారు.
ఈ రూ.మూడు కోట్లతో ప్రాజెక్టును ఎంతకాలానికి పూర్తిచేస్తారో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. సుమారు 24వేల ఎకరాలు ఈ జంఝావతి కాలువ ద్వారా సాగులోకి రావలసి వుండగా, అరకొర మంజూరులో రైతులకు తీవ్రమైన అన్యాయము చేశారన్నారు. రైతులకు జరిగిన అన్యాయానికి, నిధుల మంజూరు విషయంలో జరిగిన అలసత్వానికి నిరసనగా ఈనెలాఖరులో ఎమ్మెల్యే ఇంటిముందు నియోజకవర్గ రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామన్నారు. సమావేశంలో బోను రామినాయుడు, చుక్క లక్ష్మునాయుడు, మడక విశ్వనాథం, తీళ్ల శివున్నాయుడు, బడే రామారావు, గండి శంకరరావు, శ్రీరాములునాయుడు యాళ్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.