వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి
ఏలూరు : మహాధర్నా సభలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ 200 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలనలో కూడా ప్రజలు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా రైతుల వద్ద ఒక బస్తా ధాన్యం కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బాబు నిలబెట్టుకోలేదన్నారు. రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్‌తో తమ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసిందని సుబ్బారాయుడు ఆరోపించారు. ధర్నాకు రావడానికి బస్సులను ఇవ్వవద్దని, ఆయా రూట్లల్లో నిత్యం తిరిగే ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించడం దివాలకోరుతనమని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనుసైగ చేస్తే జిల్లా ప్రజలు తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని కొత్తపల్లి పేర్కొన్నారు.
ప్రభుత్వం మెడలు వంచి, కళ్లు తెరిపించి హామీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయించడం కోసం తమ పార్టీ పోరాడుతుందని, అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనుకాడబోమని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, అధికారం కోసం చంద్రబాబునాయుడు చెప్పని అబద్ధం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం వాటి ఊసు కూడా ఎత్తడం లేదని విమర్శించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలనే నయం
Published Sat, Dec 6 2014 1:28 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement