మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మూలాపేటలో కొలువుదీరిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
నెల్లూరు (బృందావనం): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మూలాపేటలో కొలువుదీరిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆది దంపతులు కల్యాణోత్సవం అనంతరం ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభో...శంకర.. పాహిమాం.. పాహిమాం.. అంటూ తన్మయత్వంతో భక్తుల నామస్మరణ, మేళతాళాలు, భాజభజంత్రీలు, తప్పెట్లు, బాణసంచా సందడి, యువకుల కేరింతల రథోత్సవం వేడుకగా సాగింది.
వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తజనం విశేష పుష్పాభరణాలతో కొలువైన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివార్ల రథోత్సవం మూలాపేట, బ్రాహ్మణవీధి, ఈఎస్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలవీధి, పొట్టిశ్రీరాములు బొమ్మ, అలంకార్ సెంటర్, రాజావీధి, రావి చెట్టు సెంటర్ మీదుగా దేవస్థానం వరకు.
కాగా, 11.30 గంటల సమయంలో మూలాపేటలోని శ్రీవేదసంస్కృత పాఠశాల వద్దకు చేరుకోగా రథచక్రంలో తలెత్తిన స్వల్ప సాంకేతిక లోపంతో 10 నిమిషాల పాటు రథోత్సవం నిలిచింది. రథ చోదకులు, సొప్పవేసేవారు, పర్యవేక్షకులు సరిదిద్దడంతో రథయాత్ర సాఫీగా సాగింది. దేవస్థానం అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మల ఆధ్వర్యంలో వేదపండితులు తొలుత దేవదేవేరులకు స్నపనం, విశేష పూజా కార్యక్రమాలు, నిత్యహోమం, శాంతి, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకారం చేసి రథంలో కొలువుదీర్చారు. ఉభయకర్తలుగా శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్, ప్రముఖ కాంట్రాక్టర్ ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఆల్తూరు గిరీష్‌కుమార్‌రెడ్డి, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు నారపనేని శ్రీనివాసులు, భూపతి విజయకుమార్, డేగా జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి, కేవీఆర్ విజయరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.
రథోత్సవంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్
రథోత్సవానికి ముందు జరిగిన పూజా కార్యక్రమాల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత ఆలయంలో భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అనిల్‌ను ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పరమేశ్వరుడు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలను,సుఖశాంతులను ప్రసాదించాలని వేడుకున్నట్లు వివరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న రథోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, ఎండీ ఖలీల్‌అహ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకులు మురళీకృష్ణయాదవ్, వందవాసి రంగ, కుంచాల శ్రీనివాసులు, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.జనార్దన్‌రెడ్డి, వడ్డమూడి చంద్ర, సతీష్, నవీన్ పాల్గొన్నారు.
కనువిందుగా అన్నపూర్ణ సమేత
నీలకంఠేశ్వరస్వామి నగరోత్సవం
మూలాపేటలో కొలువైన అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వరస్వామివారు చిరురథంపై నగరోత్సవం చేశారు .కనువిందుగా ఈ కార్యక్రమం సాగింది. ఆలయ అర్చకులు నందిగామ వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పెళ్లూరు వెంకటరమణయ్య, శాశ్వత నిత్యనైవేద్య నిర్వాహక కమిటీ చైర్మన్ ఆత్మకూరు మోహన్‌రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉభయకర్తలుగా రేణంగి సత్యనారాయణ, పద్మావతి దంపతులు వ్యవహరించారు. రాత్రి పుణ్యకోటి విమానం(చప్పర ఉత్సవం)నిర్వహించగా ఉభయకర్తలుగా మాలేపాటి మాల్యాద్రి, చిరంజీవమ్మ దంపతులు వ్యవహరించారు.
అశ్వవాహనంపై దర్శనమిచ్చిన
మీనాక్షీ సమేత సుందరేశ్వరుడు
రాజరాజేశ్వరీ దేవస్థానంలో కొలువైన మీనాక్షీ సమేత సుందరేశ్వరస్వామి వారు అశ్వవాహనంపై నగరోత్సవం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం రుద్రహోమం, పూర్ణాహుతి, తీర్థవాది (త్రిశూల స్నానం), ధ్వజావరోహణం జరిగింది. స్వామివారు శ్రీశైల మల్లికార్జునస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉభయకర్తలుగా నంబూరి మునిరత్నంనాయుడు, కృష్ణకుమారి వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కోదండరామిరెడ్డి, ధర్మకర్త జయరామ్ పర్యవేక్షించారు.
స్వామివారికి ఏకాంతసేవ నేడు
శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ జరగనుంది. స్వామివారు శ్రీశైల మల్లికార్జునస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.