అక్రమాలకు హామీ! | Mahatma Gandhi Upadhi Hami Pathakam Problems | Sakshi
Sakshi News home page

అక్రమాలకు హామీ!

Published Mon, Mar 25 2019 10:31 AM | Last Updated on Mon, Mar 25 2019 10:33 AM

 Mahatma Gandhi Upadhi Hami Pathakam Problems - Sakshi

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉపాధి హామీ పథకం పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి అంతాఇంతా కాదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచేయడంతోపాటు పేదలకు అందాల్సిన ఉపాధి వేతనాలను కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పనులు చేపట్టకుండానే జరిగినట్టు చూపించేస్తున్నారు. తక్కువ పనిచేసి ఎక్కువ కొలతలు వేసి స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు దిగమింగేసిన దాఖలాలు అనేకం. చెరువుగట్లలో అవినీతి.. కూరగాయల పందిర్లలో అక్రమాలు.. ఉద్యానవన మొక్కల పెంపకంలో నిధులు స్వాహా.. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అవకతవకలు.. నీరు చెట్టులో నాసిరకం పనులు.. సీసీ రోడ్ల పేరుతో దోపిడీ.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో చేతివాటం... ఇలా ఒకటేమిటి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులన్నీ అక్రమాలకు హామీగా మార్చేశారు.


విచారణపేరుతో బోలెడు ఖర్చు
జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సోషల్‌ ఆడిట్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు పనుల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏమేరకు నిధులు మింగేశారో తేల్చుతారు. అయితే దీనికోసం చేసే ఖర్చే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా రూ..300 కోట్లు ఖర్చుచేశారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో గడచిన ఎనిమిదేళ్లుగా జరిగిన అక్రమాలు పరిశీలించేందుకు చేసిన ఖర్చు దాదాపుగా రూ.5.60 కోట్లు. ఇంతా చేసి వీరు తేల్చిన అక్రమాల విలువ కేవలం రూ.4.10 కోట్లే. అంటే పరిశీలనకు అయ్యే ఖర్చుకంటే అక్రమాల విలువే తక్కువన్నమాట.


రికవరీల్లో రాజకీయ జోక్యం
జిల్లా వ్యాప్తంగా రూ.4.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించగా ఇంతవరకు రూ.1.52 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఈ విషయంలో రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 
16 మంది ఏపీఓలు, ఆరుగురు ఇంజినీరింగు కన్సల్టెంట్లు. 66 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన 10,447 మంది అక్రమాలకు పాల్పడినట్టు సోషల్‌ ఆడిట్‌లో తేల్చారు.  కానీ రికవరీ విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. కనీసం అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులైనా జారీ చేశారా అంటే అందులోనూ అలసత్వం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 34 మండలాలకు గాను 2017–18  ఆర్థిక సంవత్సరంలో 9 మండలాల్లో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 30 మండలాల్లో సోషల్‌ ఆడిట్‌ జరిగింది. ఇందులో గుర్తించిన అక్రమాల విలువ రూ.2,35,21,296. అందులో నేటి వరకు రూ.20,30,788 రికవరీ చేశారు. అవినీతికి పాల్పడిన 986 మందికి నోటీసులు జారీచేశారు.


అక్రమాలకు ‘బాట’లు
ఉపాధిలో తమవారికి లబ్ధి చేకూర్చేందుకు అనువుగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులను తెరమీదకు తీసుకువచ్చారు. తెలుగు తమ్ముళ్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఈ పనులు దక్కించుకుని పనులు చేయకుండానే బిల్లులు నొక్కేశారు. ఇక చంద్రన్న బాటల పేరుతో నిర్మించిన సీసీరోడ్లలో జరిగిన అవినీతి తారాస్థాయికి చేరుకుంది. 
అవసరం లేనిచోట్లకు కూడా నాశిరకం నిర్మాణాలు చేపట్టి అడ్డగోలుగా దోచుకున్నారు. పంటపొలాలకు... వ్యవసాయ పనులు చేసుకునే కళ్లాలకు ఇష్టానుసారం సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. కానీ డబ్బులు మాత్రం మొత్తం కొట్టేశారు.

కూలీలకు అందని వేతనాలు
ఉపాధి హామీ పథకం పేరుచెప్పి కమీషన్లు వెనకేసుకుంటున్న ప్రజాప్రతినిధులు, అక్కమార్కుల పాలవుతున్న నిధులు కోట్లలో ఉంటే ఎండనకా, వాననకా కాయకష్టం చేస్తున్న ఉపాధి కూలీలకు మాత్రం అన్యాయం జరుగుతోంది. వారికి అందాల్సిన వేతనాలను నెలల తరబడి ఇవ్వకుండా ప్రభుత్వాలు వారిని పస్తులుంచుతున్నాయి. జిల్లాలో గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటి వరకూ నాలుగు నెలలకు రూ.100 కోట్ల బకాయి ఉంచింది. 


ఉపాధి హామీ పథకం వివరాలు:

జిల్లాలో 921 పంచాయతీల్లో  శ్రమశక్తి సంఘాలు: 42,432 
జిల్లాలో ఉన్న జాబ్‌కార్డులు సంఖ్య:3.80లక్షలు
కూలీలకు రావాల్సిన బకాయిల మొత్తం  (4 నెలలకు): రూ.100 కోట్లు      
        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement