సమర్థంగా రచ్చబండ కార్యక్రమం
Published Fri, Nov 8 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకాధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా 19,307 మందికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. 55,335 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని, 29,047 మందికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 38 పనులకు శంకుస్థాపన జరుగుతాయని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 78 పనులకు గానూ రూ 17.60 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 నుంచి 39 శాతం లోపు వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్ కింద రూ. 200 అందజేయడానికి సదరమ్ కార్యక్రమం చేపట్టనున్నామని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే 1 తర్వాత పుట్టిన అర్హత గల ఆడ పిల్ల పేరు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు. ఎస్.కోట, విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అనుమతితో షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ యు.సి.జి. నాగేశ్వరరావు, పీఓ రజిత్‌కుమార్‌సైనీ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సీపీఓ బి.మోహనరావు పాల్గొన్నారు.
రచ్చబండ షెడ్యూల్ ఖరారు నేడు
జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న రచ్చబండ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ శుక్రవారం సాయంత్రానికి ఖరారవుతుందని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ఎ.శోభ తెలిపారు. గురువారం జేసీ చాంబర్‌లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరిస్తామన్నారు.
Advertisement
Advertisement